తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే తన పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో టీఎఫ్‌సీసీకి కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించారు. మూడోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ సహా 15 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు. అయితే టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ఎన్నికై 24 గంటలు గడవక ముందే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనని సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని, తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదని, ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా పదవిలో కొనసాగలేనని పదవికి రిజైన్ చేసేశారు.
నిజానికి సునీల్ నారంగ్‌కి ఆ పదవి వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఆయకి బోలెడు వ్యాపారాలు వున్నాయి. సినిమా ఇండస్ట్రీపై కావాల్సినంత పట్టువుంది. ఎదో గౌరవార్థం అన్నట్టుగా ఆ పదవిలో వున్నారు. ఆయన లాంటి పట్టు వున్న వ్యాపారవేత్త ఆ పదవిలో వుంటే ఛాంబర్‌కే ప్లస్సు. అయితే తనకి లేనిపోని తలనొప్పులు తెచ్చిన ఆ పదవికి గుడ్‌బై చెప్పారు సునీల్. ఇక్కడితో ఆయన బాధ్యత తీరిపోయిందని అనడానికి లేదు. నిజానికి ఈ ఇష్యూలో నేర్చుకోవాల్సిన గుణపాఠం వుంది.
సునీల్ నారంగ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం.. మొన్న జరిగిన ప్రెస్‌మీట్. ఆ ప్రెస్మీట్లో ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ అసందర్భ ప్రేలాపనలు. కొందరికి మీడియా అంటే ఒక పాషన్‌గా మారింది. మీడియా ముఖ్య ఉద్దేశాన్ని పక్కన పెట్టి కొందరు వ్యక్తిగత దర్పం చూపించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ‘సబ్జెక్ట్’ని పక్కన పెట్టి మిగతా విషయాలన్నీ మాట్లాడుతుంటారు. మొన్న జరిగిన ప్రెస్మీట్లో కూడా అదే జరిగింది.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి ప్రతి రెండేళ్లకి ఓసారి ఎన్నికలు జరుగుతాయి. ఏవో చిన్న మార్పులు తప్పితే దాదాపు ఆ ఎన్నిక ఏకగ్రీవంగానే వుంటుంది. కొత్త కమిటీని ప్రెస్‌మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారు. ఇది ఆ ప్రెస్‌మీట్ ‘సబ్జెక్ట్’. కానీ మొన్న జరిగిన ప్రెస్మీట్లో సెక్రటరీ శ్రీధర్ సీక్రెట్ ఎజెండాతో వచ్చారు. ఎగ్జిబిటర్స్ ఇష్యూపై వకాల్తా పుచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని థియేటర్స్ ఖాళీ పెట్టుకున్నాం ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని నిలదీశారు. రెండు కోట్లు రెవెన్యూ చేయలేని ఓ హీరో 13 కోట్లు తీసుకున్నాడని మరో ఆరోపణ చేశారు. ఆరు నెలల్లో మూడు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయని తీర్పు ఇచ్చారు. ప్రెస్‌మీట్ సబ్జెక్ట్‌కి ఈ ప్రకటనలకి ఎలాంటి సంబంధం లేదు. కడుపులో వున్న కుళ్లినంత కక్కేసినట్టుగా మాట్లాడారు.
దిల్ రాజు, అల్లు అరవింద్ కూడా థియేటర్స్ బంద్ ఇష్యూ మీద ప్రెస్మీట్లు పెట్టారు. సబ్జెక్ట్‌కి కట్టుబడి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకునే ఉద్దేశం ఎవరికీ లేదని సరిగ్గా కమ్యూనికేట్ చేశారు. కానీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్‌మీట్ మాత్రం చాలా వివాదాస్పదంగా సాగింది.
సెక్రటరీ శ్రీధర్ మాట్లాడితే.. సునీల్ ఎందుకు రాజీనామా చేశారని అనుకోవచ్చు. ఒక జనరల్ బాడీ ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు అందులో ప్రతిమాట ప్రెసిడెంట్‌కి వర్తిస్తుంది. ఆయన అనుమతితోనే శ్రీధర్ అలాంటి విమర్శలు చేసివుంటారనే అభిప్రాయం సహజంగానే వుంటుంది. ముఖ్యంగా ఓ హీరోని ఆయన టార్గెట్ చేసిన తీరు అక్షేపణీయం. హీరోల ఇమేజ్‌కి అప్రతిష్ట తెచ్చే ఇలాంటి మాటల్ని ఎవరూ సహించరు. ఇదే విషయంలో ఇండస్ట్రీ పెద్దల నుంచి సునీల్ తీవ్ర ప్రతికూలతలకి ఎదురయ్యారు. ఇంక ఈ గొడవతో తనకి సంబంధం లేదని చెప్పడానికి రాజీనామా చేశారు.
మీడియా అనేది ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే సాధనం. ప్రెస్‌మీట్ అంటే ఆశామాషీ కాదు. సబ్జెక్ట్‌పై కంట్రోల్ లేకుండా ఏదిపడితే అది మాట్లాడితే పర్యవసానాలు ఇలానే వుంటాయి. ఒక గ్రూప్ ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు అందులో వక్తలు ఏం మాట్లడతారో అనే క్లారిటీ ఆ గ్రూప్ ని లీడ్ చేస్తున్న పెద్ద మనిషికి వుండాలి. శ్రీధర్ వాఖ్యలు చేసినప్పుడు సునీల్ పక్కనే వున్నారు. వెంటనే మైక్ తీసుకొని.. ‘శ్రీధర్ అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు. ఆయన వాఖ్యాలతో నాకు సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిగతం’ అంటే సరిపోయేది. కానీ శ్రీధర్ మాట్లాడిన మాటలు జనాల్లోకి వెళ్ళిపోయాక.. ఇప్పుడు సునీల్ రాజీనామా చేసేవరకూ వచ్చింది. ఆ పోస్ట్ ఆయనకి పెద్ద మేటర్ కాకపోవచ్చు. కానీ ఇదంతా ఓ మరకలా మిగిలిపోయింది.