జూన్ రెండో వారం టాలీవుడ్ బాక్సాఫీసు మూగబోతోంది. పవన్ కళ్యాణ్ ‘వీరమల్లు’తో జూన్ 12 కళకళలాడాల్సింది. కానీ ఆ సినిమా అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది. వాయిదా విషయం వారం ముందుగానే చెప్పారు. అయితే ఆ డేట్‌ను ఫిల్ చేయడానికి మరో ప్రామిసింగ్ సినిమా లేకపోవడం టాలీవుడ్ రిలీజ్ ప్లానింగ్‌లో డొల్లతనాన్ని మరోసారి బయటపెట్టింది.
సినిమాల విడుదల విషయంలో టాలీవుడ్ తీరుపై ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి తీరుగానే కొత్త సినిమాల విడుదలలు ఉంటాయి. కాస్త క్రేజ్ ఉన్న సినిమాలన్నీకి ఒకే డేట్ కావాలి. అన్నీ సినిమాలు క్లాష్ అయ్యేలా వస్తాయి. అన్నిటికీ పండగ సీజన్లు కావాలి. మళ్లీ అదే నిర్మాతలు, “కంటెంట్ బావుంటే జనాలు ఏ సీజన్లోనైనా సినిమా చూస్తారు” అని విరుద్ధ భాష్యాలు చెబుతుంటారు. కానీ రిలీజ్‌కి మాత్రం ఏ సినిమా రెడీగా ఉండదు.
నిజానికి జూన్ 12 మంచి డేట్. అప్పుడే స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అవుతాయి. యూత్ పుల్లింగ్ బావుంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే డేట్ అది. అలాంటి డేట్ దొరికితే కనీసం ఓ మోస్తరు బజ్ ఉన్న చిన్న సినిమా వచ్చినా లాభపడేది. కానీ కనుచూపుమేరలో విడుదలకు రెడీ అయిన సినిమా కనిపించదు.
నిర్మాణంలో ఎలాంటి పద్దతులు పాటిస్తున్నారో తెలియదు కానీ, ఈ రోజుల్లో ఒక సినిమాని రిలీజ్‌కు రెడీ చేయడమే ఓ బ్రహ్మపదార్థంగా చెబుతుంటారు మేకర్స్. అసలు, ఇంత టెక్నాలజీ, మాన్పవర్ అందుబాటులో లేని రోజుల్లోనే సినిమాని రెడీ చేసుకుని, మంచి డేట్ కోసం ఎదురు చూసి, డేట్ దొరికితే ఓ ప్రెస్ మీట్ పెట్టి, పోస్టర్లు అంటించి సినిమాని విడుదల చేసేవారు. కంటెంట్ బావుంటే తెగ ఆడేసేది.
దాసరి, ఈవీవీ, కృష్ణారెడ్డి, జంధ్యాల, కోడిరామకృష్ణ, రేలింగి నరసింహారావు… ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు మంది దర్శకులు హుటాహుటిన సినిమాని థియేటర్లకు పంపించేవారు. పెన్డ్రైవులు కూడా లేని రోజుల్లో అలాంటి పనులు చేసి చూపించారు.
కానీ ఇప్పుడు టెక్నాలజీ సూపర్ ఫాస్ట్. ‘ఏఐ’తో పాటలు, డబ్బింగ్, సీన్లు, డీఏజింగ్, పోస్టర్ మేకింగ్… ఇలా బోలెడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా కూడా పనులు జరగడం లేదు. థియేటర్లు ఖాళీగా ఉన్నాయి తప్పా కొత్త సినిమాల సందడి లేదు. ఇప్పుడు జూన్ 12ను ఖాళీగా వదిలేసి పరిశ్రమ మరోసారి తన లోపాన్ని బయటపెట్టుకుంది.