అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్ ల మధ్య కొనసాగుతున్న డైలాగ్ వార్ కు ఇక ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇటీవల ట్రంప్ – మస్క్ ల మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ తగ్గేదేలే అంటూ డైలాగ్ వార్ కు దిగారు. నా వల్లే గెలిచావ్ అంటూ మస్క్ అంటే..నువ్వు లేకపోయినా నేను గెలిచేవాడిని.. ఎక్కువ మాట్లాడితే నీ కంపెనీలపై అధిక పన్నులు వేస్తానని మస్క్ కు వార్నింగ్ ఇవ్వడంతో విషయం మరింత ముదిరింది.
ఇద్దరి మధ్య విబేధాలు ఎక్కడికి దారితీస్తాయోననే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మస్క్ కు చెందిన టెస్లా కారును తాను వదులుకోనని, స్టార్ లింక్ సేవలను కూడా కొనసాగిస్తానని ట్రంప్ చెప్పడంతో… మస్క్ తో కొనసాగుతున్న వివాదానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
మస్క్ తో ఇటీవల సంబంధాలు దెబ్బతినడంతో ఆయన కంపెనీ అయిన టెస్లా కారును ట్రంప్ వాడరు అనే ప్రచారం కొనసాగింది. దీనిపై తాజాగా ట్రంప్ ను ప్రశ్నించగా.. తాను ఆ కారునే వినియోగిస్తాను.. అంతేకాకుండా వైట్ హౌజ్ లో ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే ఆలోచన కూడా తనకు లేదని, స్టార్ లింక్ మంచి సేవలు కూడా అందిస్తోందని ప్రశంసించారు.
మస్క్ తో మాట్లాడాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. నేను అతని స్థానంలో ఉంటే, మాట్లాడాలని అనుకునేవాడిని.. అతను కూడా అదే అనుకుంటుండవచ్చు. ఈ విషయాన్ని మీరు మస్క్ నే అడగాలి అంటూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్ట్ చీశారు. దీనికి మస్క్ హార్ట్ ఎమోజీతో రియాక్ట్ కావడంతో ఇద్దరి మధ్య వివాదం ఇక ముగిసినట్లేనని అంటున్నారు.