అమెరికాలో పరిస్థితులు రాను రాను దిగజారిపోతున్నాయి. దేశంలో ఎక్కడో చోట ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సున్నితంగా డీల్ చేయాల్సిన విషయాలను ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను దింపే వరకూ తీసుకురావడంతో కాలిఫోర్నియా తగలబడిపోయినంత పని అయింది. అక్కడ అంటుకున్న చిచ్చు అమెరికా అంతా వ్యాపించేలా కనిపిస్తోంది. తాజాగా ఓ వైపు ట్రంప్ పుట్టిన రోజు, అమెరికా సైన్యం 250 వార్షికోత్సవ పరేడ్‌కు సమానంగా జరిగాయి. ఇంకా చెప్పాలంటే ఆ నిరసనలే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాయి. ఎక్కువ మంది పాల్గొన్నారు కూడా.
అమెరికా సైనిక పరేడ్‌ను వ్యక్తిగత బలప్రదర్శనగా మార్చిన ట్రంప్
అమెరికాలోని వివిధ నగరాల్లో “నో కింగ్స్ ” పేరుతో ఆందోళనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్ విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అధికార దుర్వినియోగం, పౌర స్వేచ్ఛపై దాడులు, వలసదారులపై అణచివేత, సైనిక పరేడ్‌ను వ్యక్తిగత ఆధిపత్య ప్రదర్శనగా ఉపయోగించడం వంటి అంశాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్ డిక్టేటర్లా తన పుట్టిన రోజున సైనిక వార్షికోత్సవాన్ని నిర్వహించారు. రెండింటికి సంబంధం లేకపోయినా.. కలిపేసి.. ఆ సైన్యం అంతా తన వ్యక్తిగతం అన్నట్లుగా చేయడంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది.
ట్రంప్ విధానాలతో అసహనంగా ఉన్న జనం – వరుసగా నిరసనలు
అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ పరేడ్ ట్రంప్ తన వ్యక్తిగత ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఉపయోగించుకున్నారని ..ఇది రాచరికాన్ని చూపించడమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపుగా ప్రతి చిన్న నగరంలోనూ నిరసనలు జరిగాయి. కోటిన్నర మందికిపైగా పాల్గొన్నారు. లాస్ ఏంజెల్స్‌లో వలసదారులపై జాతీయ రక్షణ దళాలు , యు.ఎస్. మెరైన్ కార్ప్స్‌ను ఉపయోగించి ట్రంప్ అణచివేత చర్యలు బ్యాక్ ఫైర్ అయ్యాయి. ప్రస్తుతం ట్రంప్ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత, అసహనం ప్రాథమిక స్థాయిలోనే ఉంది.
నిరసనలు దారి తప్పితే సివిల్ వార్
రాబోయే రోజుల్లో ట్రంప్ పై ఆగ్రహం ప్రజల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఆయన తన నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు చేసుకోకపోగా.. మరింతగా సాధారణ పౌరుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అక్రమ వలసదారులే కాదు.. పూర్తి స్థాయిలో చెల్లుబాటు వీసాలు ఉన్న వారిని కూడా టార్చర్ పెడుతున్నారు. ట్రంప్ దెబ్బకు అమెరికన్ పౌరులు కూడా.. ఇబ్బంది పడుతున్నారు. ట్రంప్ ఇదే తరహా పులకేశీ పాలన చేస్తే.. అమెరికాలో సివిల్ వార్ తప్పదన్న సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి.