మంచు ఫ్యామిలీకి విజయం దక్కి చాలా కాలమైంది. మోహన్ బాబు లెగసీని కొనసాగించడంలో విష్ణు, మనోజ్ ఇద్దరూ సరైన అడుగులు వేయలేకపోయారు. వాళ్ల నుంచి సినిమాలు రావడమే తగ్గిపోయింది. అయితే ఈసారి ఓ లార్జర్ దెన్ లైఫ్ సినిమాను ప్లాన్ చేశారు విష్ణు. అదే కన్నప్ప.
విష్ణు కోసం మోహన్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయనకి ఉన్న పరిచయాలతో ప్రముఖ నటులను ఇందులో భాగం అయ్యేలా చూశారు. ప్రభాస్ ఈ సినిమాలో నటించడం మెయిన్ హైలైట్. అలాగే మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు… ఇలా ఎంతో మంది ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. శక్తిమేర దేశవ్యాప్తంగా ప్రమోషన్లు చేశారు. మోహన్ బాబు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తిరిగారు.
జూన్ 27న కన్నప్ప సినిమా వస్తోంది. ఈ వారం మరో చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడం కన్నప్పకి కలిసొచ్చే అంశం. విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ అనే డబ్బింగ్ సినిమా వస్తుంది. కానీ సినిమాకు పెద్ద బజ్ లేదు. కాజోల్ ‘మా’ అనే చేసింది. ఈ సినిమా కూడా ఈ వారమే వస్తోంది. ఈ సినిమాకు కూడా పెద్ద ప్రచారం లేదు. మల్టీప్లెక్స్‌లో కొన్ని స్క్రీన్లలో పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం కుబేర ఒక్కటే మంచి టాక్‌తో ఆడుతోంది. ఈ నాలుగు రోజుల్లో దానికి కావలసిన రన్ దొరుకుతుంది. జూన్ 27 విష్ణు కన్నప్పకి సోలో డేట్ దొరికినట్లే భావించాలి. ఈ సినిమాపై కోటి ఆశలు పెట్టుకున్నారు విష్ణు, మోహన్. ఈ సినిమా విజయం మంచు ఫ్యామిలీకి చాలా కీలకం.