‘కన్నప్ప’ అనేది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా మొదలెట్టేముందు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. నమ్మకాల్లేవు. ‘ఓ భారీ పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నా’ అన్నప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ క్రమంగా ఈ ప్రాజెక్ట్ లోకి ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. దాంతో ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు.
తనని ట్రోల్ కి గురి చేస్తున్నా, వెటకారంగా కామెంట్లు చేస్తున్నా విష్ణు పట్టించుకోలేదు. తన పని తాను చేసుకొంటూ వెళ్లాడు. దాదాపు రూ.200 కోట్లు ఖర్చు పెట్టి తీశాడు. ఇది విష్ణు కెరీర్‌కి పెద్ద రిస్క్. విష్ణుకి అంత మార్కెట్ లేదన్నది నిజం. ఈ సినిమా వర్కవుట్ అవ్వాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ సాయం పట్టాలన్నది నిజం. ప్రభాస్ పాత్ర రెబల్ అభిమానులకు నచ్చితే – పంట పండినట్టే.
కాకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులు అమ్మలేదు. ఆడియో రైట్స్ అమ్మలేదు. ఏరియాల వారీగా అమ్మలేదు. రూ.200 కోట్లకు రూ.200 కోట్లూ రిస్కే. సినిమా బాగుంటే, మంచి టాక్ వస్తే ప్రతీ పైసా తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఈ సినిమాని ఇంత రిస్క్ పెట్టి రిలీజ్ చేస్తున్నాడు విష్ణు. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశాడు. అయితే ప్రభాస్ ఒక్క ఈవెంట్ కు వచ్చినా బాగుండేది. ప్రభాస్ తో ఓ కామన్ ఇంటర్వ్యూ చేసి బయటకు వదులుదాం అనుకొన్నారు. కానీ అది కూడా కుదర్లేదు. ఈ సినిమాలో ఇంత మంది స్టార్లు ఉన్నా.. తానొక్కడై మోశాడు విష్ణు. కన్నప్ప విడుదలకు ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. ఈరోజు అడ్వాన్స్ బుకింగులు మొదలు కాబోతున్నాయి. ప్రీమియర్లు వేయాలని విష్ణు భావించినా, ఆ ఆలోచన ఇప్పుడు విరమించుకొన్నట్టు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగులు, ట్రెండ్ ని బట్టి – అసలు కన్నప్ప చూడాలన్న ఆలోచన సినిమా ప్రేక్షకులకు ఉందా, లేదా? అనేది తేలిపోతుంది.