మంచు ఫ్యామిలీకీ ట్రోలర్స్ కీ అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా విష్ణుతో. విష్ణు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా ఓ వర్గం ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈమధ్య ఇలా తనపై పనిగట్టుకొని ట్రోల్ చేస్తున్నవాళ్లందరిపైనా వివిధ సెక్షన్ల కింద విష్ణు కేసులు వేశారు. వాళ్లంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. విష్ణు ముందస్తు జాగ్రత్తలు కాస్త ఈ తాకిడిని తగ్గించినట్టే అనుకోవాలి.
రేపు (శుక్రవారం) కన్నప్ప విడుదల అవుతోంది. ఈ సినిమా కోసం విష్ణు చాలా కష్టపడ్డాడు. ప్రభాస్ లాంటి బడా స్టార్లని రంగంలోకి దించాడు. దాదాపు రూ.200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఓపెనింగ్ డే వసూళ్లు ఎలా ఉంటాయా? అని విష్ణుతో పాటు చిత్రసీమ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు తన సినిమాపై వచ్చే ట్రోలింగ్ ని కంట్రోల్ చేయడానికి కూడా విష్ణు సన్నద్ధంగా ఉన్నాడు. పని గట్టుకొని కావాలని విమర్శించే వాళ్లపై కఠిన చర్యలు తప్పవంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. అయితే పరోక్షంగా రివ్యూలను కూడా అడ్డుకొంటామని చెప్పే ప్రయత్నం ఈ నోట్ లో కనిపించింది. తన సినిమాపై నెగిటీవ్ రివ్యూలు రాకుండా విష్ణు తీసుకొన్న జాగ్రత్త ఇదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈమధ్య రివ్యూల తాకిడి బాగా ఎక్కువైంది. ఫస్ట్ షో పూర్తయిన వెంటనే రివ్యూ వచ్చేస్తోంది. ట్విట్టర్ రివ్యూలు, వీడియో రివ్యూలు షరా మామూలే. మీడియా సంస్థలే కాకుండా సినిమాపై అభిమానం, అవగాహన ఉన్నవాళ్లు కూడా తమ తమ అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. వాళ్లని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాదు. కన్నప్ప సినిమా బాగుంటే పర్వాలేదు. అటూ ఇటూ అయితే మాత్రం ట్రోలింగ్ పెరుగుతుంది. విమర్శలు ఘాటుగా ఉంటాయి. వాటిని ఇలాంటి ప్రెస్ నోట్ లు, అందులో ప్రస్తావించిన సెక్షన్లు ఆపుతాయా?
సినిమా విడుదలైన తరవాత వచ్చే రివ్యూల్ని బట్టి దర్శక నిర్మాతలు, హీరోలు స్పందిస్తారు. ముందే… ‘నెగిటీవ్ రివ్యూలు ఇస్తే జాగ్రత్త..’ అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమా బాగున్నా.. నెగిటీవ్ రివ్యూలు ఇస్తే అది కావాలని చేస్తున్న పనే అనుకోవాలి. ఒక వేళ నిజంగా కన్నప్ప జనాలకు, విశ్లేషకులకు నచ్చకపోతే నిస్పక్షపాతంగా, ఉన్నది ఉన్నట్టు విమర్శిస్తే దాన్ని కన్నప్ప టీమ్ పాజిటీవ్ గా తీసుకొంటుందా? అనేదీ అనుమానమే. జనాభిప్రాయాల్ని, రివ్యూల్నీ ఇలాంటి హెచ్చరికలు ఆపలేవు. చట్టం తన పని తాను చేసుకొని పోయినట్టే.. రివ్యూ రైటర్లు కూడా తమ పని తాము చేసుకొంటూ పోతారు ఈ విషయంలో ఎవరి కంట్రోల్ ఉండదు. దాన్ని విష్ణు తెలుసుకొంటే మంచిది.