అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా ఫ్యామిలీపై ప్రశంసల వర్షం కురిపించారు. చెడు అలవాట్లు లేకపోతే సామాన్యులు కూడా అద్భుత విజయాలు సాధించగలరని చెబుతూ చిరంజీవిని ఉదాహరణగా ప్రస్తావించారు.
‘‘చిరంజీవి గారు ఎలాంటి నేపథ్యం లేకుండా కష్టపడి, దేశం గర్వించదగ్గ నటుడిగా, మంచి మనిషిగా గుర్తింపు పొందారు. దాదాపు 50 సంవత్సరాల నిరంతర శ్రమతో, కఠిన దీక్షతో సినీ రంగంలో రాణించారు. ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోకుండా, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, వ్యసనాలకు బానిస కాకుండా, ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ఆదర్శంగా నిలిచారు’’ అని ప్రశంసించారు.
రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ..చరణ్ నాకు స్కూల్‌కి వెళ్తున్నప్పటి నుంచీ తెలుసు. నా కళ్లముందే స్కూల్‌కి వెళ్లే కుర్రాడు, రియల్ స్టార్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి, ఈరోజు ఆస్కార్ అవార్డు సాధించి దేశానికి గౌరవం తీసుకొచ్చాడు. ఇది సాధారణ విషయం కాదు. చిరంజీవి గారి పేరుతో మనం ఇంట్లో ఫంక్షన్‌కు పిలవొచ్చు, కానీ ఆస్కార్ అవార్డును మాత్రం ఇచ్చలేం. ఆ అవార్డు ఆయన కష్టానికి ప్రతిఫలంగా లభించింది. దీక్ష, పట్టుదల వల్లే ఈ స్థాయికి చేరుకున్నారు’ అన్నారు.
‘‘సినిమాల్లో వారు పోషించే పాత్రలను మాత్రమే కాదు, వారి నిజమైన జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకోండి. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకుని, సమాజంలో నిజమైన హీరోలుగా నిలవాలి’’అని ఆకాంక్షించారు రేవంత్.