ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యుగం ప్రారంభమయింది. ప్రతి రంగంలోనూ ఏఐ ఉపయోగించేలా ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు ప్రారంభమవుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం కూడా ఉంది. చివరికి ఏఐ వల్ల అన్ని ఉద్యోగాలు పోతాయని .. మాన్యువల్ గా పని చేసే వారి ఉద్యోగాలు మాత్రమే ఉంటాయన్న విశ్లేషణలు చేస్తున్నారు. కానీ అసలు నిజాన్ని మాత్రం చాలా కొద్ది మంది విశ్లేషిస్తున్నారు. అదేమిటంటే.. ఏఐ కాదు.. దాని తాతల్లాంటి టెక్నాలజీ వచ్చినా సరే ఉద్యోగాలు పెరుగుతాయి కానీ తగ్గవు. కానీ ఈ పాజిటివ్ విశ్లేషణను.. తీసుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉండలేకపోతున్నారు.
ఏఐతో కొత్త ఉద్యోగాల సృష్టి
ఏంతో ఉద్యోగాలు పోవడం అన్నది నిజం. కానీ కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఏఐ వల్ల ఇప్పుడు అత్యధికంగా కోడింగ్ చేసేవారు ప్రభావితం అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా కోడింగ్ పూర్తి చేసుకుంటున్నాయి కంపెనీలు. ఏళ్ల తరబడి కోడింగ్ చేసుకుంటూ ఉన్న ఉద్యోగులు ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. వారు తమ కెరీర్ లో ఎక్కడ ప్రారంభించారో అక్కడ ఉండటం వల్లనే నష్టపోతున్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటే కొత్త రోల్స్ లో ఉండేవారు.
ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ఏలకి మనుగడ
టెక్నాలజీ శరవేగంగా మారుతోంది. దానికి తగ్గట్లుగా తాము స్కిల్స్ పెంచుకుకుంటే చాలు ఉద్యోగాలకు కొరత ఉండదు. అంతే కాదు.. టెక్నాలజీ అభివృద్ధి చెందితే అదేమి ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండదు. ప్రతి ఒక్క దానికి ఖరీదు ఉంటుంది. ఏఐ మరింత ఖరీదుగా ఉంటుంది. దాన్ని ఉపయోగించాలంటే… పెద్ద సంస్థ అయినా.. వ్యక్తి అయినా డబ్బులు చెల్లించాలి. ఉద్యోగాలన్నీ పోతే.. ఆ డబ్బులు ఎవరు చెల్లిస్తారు ?. సంస్థలకు, వ్యక్తులకు ఆదాయం లేకపోతే ఏఐ ఎందుకు వినియోగిస్తారు ?. అలాంటి ఆదాయం రావాలంటే ఖచ్చితంగా ఉద్యోగాలు ఉండాలి.. వ్యాపారాలు జరగాలి. ప్రజలందరూ ఉపాధి కోల్పోయి రోడ్డున పడితే ఏఐ ఎవరు ఉపయోగిస్తారు ?
మార్పునకు తగ్గట్లుగా స్కిల్స్ పెంచుకోవడమే కీలకం
ప్రపంచం శరవేగంగా మారుతోందన్నది నిజం. 90లలో స్కూల్స్ లో ఉన్న వారికి అప్పటి పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడు వింతగా అనిపిస్తుంది. ఆదిత్య 360 సినిమా చూసి ఇలా కూడా ఉంటుందా అనుకున్నారు. కానీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఇప్పు డు వచ్చేసింది. ఒకప్పుడు బ్యాంకుల కంప్యూటరీకరణ జరిగితే ఇక ఉద్యోగాలు ఉండవనుకున్నారు కానీ ఇప్పుడు బ్యాంకుల్లో రిక్రూట్ మెంట్ పెరిగింది. అంటే ఏఐ కంటే గొప్ప టెక్నాలజీ వచ్చినా.. ఉద్యోగాలు పెరుగుతాయి.. కానీ ఉద్యోగాలు ఉంచుకోవాలంటే.. తెచ్చుకోవాలంటే ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకోవాల్సిందే.