ఒకడు ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ పనిమనిషి భార్యతో ఎమ్మెల్యేకు అక్రమ సంబంధం ఉందని సిగ్గు లేకుండా ప్రచారం చేస్తాడు. ఆ మహిళ పరిస్థితి ఏమిటన్నది కూడా ఆలోచించరు. ఇంకొకడు ఫోన్ ట్యాపింగ్ లో అలా జరిగింది.. ఇలా జరిగింది.. హీరోయిన్లను తెగ వాడేశారని థంబ్ నెయిల్స్ పెట్టేస్తాడు. వాళ్లూ.. వీళ్లూ అనే తేడా లేదు. రాజకీయాల ముసుగులో కనీస విలువలు పాటించుకుండా మీడియా పేరుతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారికి చట్టాలు నర్తించడం లేదు. అక్కడే అసలు సమస్య వస్తోంది.
నేతల వ్యక్తిత్వం కించ పరిచేందుకు చీప్ ప్రయత్నాలు
మహా న్యూస్ చానల్ పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి తర్వాత ఆ చానల్ ఏం ప్రసారం చేసింది అన్నదాన్ని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. నిజానికి ఆ చానల్ పెద్దగా ఎవరికీ తెలియదు. టీఆర్పీ రేటింగ్స్ కూడా రావు. ఉంది అంటే ఉంది అని చెప్పుకోవడానికే. న్యూస్ చానల్ కు తక్కువ.. యూట్యూబ్ చానల్ కు ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు వివాదాస్పదమైన థంబ్ నెయిల్స్ కూడా.. టీవీ చానల్లో ప్రసారం చేసినవి కావు. యూట్యూబ్ లో పెట్టినవి. వాటిని చూసే బీఆర్ఎస్ అగ్రనేతలకు కోపం వచ్చింది. ఆ థంబ్ నెయిల్స్ మరీ థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ తో ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు అధికారంలో లేరు కాబట్టి వారిపై ఎలాంటి ప్రచారం చేసినా నడిచిపోతుందని స్వేచ్ఛ తీసుకున్నారు. నేతల వ్యక్తిత్వాన్ని కించపర్చవచ్చని అనుకుంటున్నారు. చేసేస్తున్నారు.
ఒకరిని మించి ఒకరు !
రాజకీయంగా పోరాడు కానీ ఇలా కుటుంబాలను కించ పరిచి, వ్యక్తిత్వాన్ని హననం చేయడం తప్పు అని ఎవరైనా వారికి చెబితే వెంటనే వారు.. అలా చెప్పిన వారి కుటుంబాలను.. .వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తారు. రాక్షసత్వం కన్నా దారుణంగా వారి తీరు ఉంటుంది. మీరు చేయలేదా అంటే మీరు చేయలేదా అని రెచ్చిపోతారు. ఇక్కడ అందరూ బాధితులే. అందరూ నిందితులే. ఒకరు ఓ స్థాయిలో దిగజారిపోతే.. మరో స్థాయికి మరో స్థాయికి దిగజారిపోతున్నారు. అది నిరంతర ప్రక్రియ లా జరిగిపోతోంది. దానికి అందరూ బాధ్యులే.
రాజకీయ పార్టీల జోక్యంతోనే అసలు సమస్య
రాజకీయపార్టీలు సొంత మీడియాలు, సోషల్ మీడియాలు పెట్టుకుంటున్నారు. అవి తమ మీడియాలు అని అందరికీ తెలుసు కానీ మీడియా పేరుతో తమ రాజకీయ ప్రత్యర్థులపై మానసిక దాడి చేయడానికి వాడుకుంటున్నారు. మరికొంత మంది ఘనత వహించిన జర్నలిస్టులు.. ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ప్రభుత్వ పెద్దలని మెప్పించేందుకు దిగజారుడు వార్తల్ని.. వారి ప్రత్యర్థులపై ప్రసారం చేస్తున్నారు. దాని వల్లే ఇలాంటి సమస్య వస్తోంది. దీనంతటికి కారణం రాజకీయమే. చట్టాల ప్రకారం.. తప్పులకు శిక్షలు ఉండకపోతే ఈ పరిస్థితి మరింత దిగజారిపోతుంది.