గత రెండు వారాల నుంచీ బాక్సాఫీసు కాస్త జోష్‌లోకి వచ్చింది. అంతకు ముందు వచ్చిన ‘కుబేర’, గత వారం విడుదలైన ‘కన్నప్ప’ మంచి వసూళ్లని అందుకొన్నాయి. వారాంతరం థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. జనాలకు థియేటర్లకు వెళ్లే మూడ్ వచ్చింది. ఇది ఓరకంగా శుభపరిణామం. ఇలాంటి మూమెంట్ కోసమే నిర్మాతలు చాలారోజులుగా ఎదురు చూస్తున్నారు.
ఈవారం కూడా ఈ జోష్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితిన్ ‘తమ్ముడు’ జులై4న విడుదల కాబోతోంది. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా ఇది. తన సినిమా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దిల్ రాజు కథ విషయంలో రాజీ పడరు. మేకింగ్ పై కూడా దృష్టి పెడతారు. ప్రమోషన్లు గట్టిగా చేస్తారు. ‘తమ్ముడు’ కోసం కూడా తగిన విధంగానే ప్రిపేర్ అయ్యారు. ఇప్పటికే ఓ ట్రైలర్ బయటకు వచ్చింది. ఈరోజు మరో ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. దర్శకుడిగా వేణు శ్రీరామ్ ట్రాక్ రికార్డు కూడా బాగానే ఉంది. ఆయన గత చిత్రాలు ఎం.సీ.ఏ, వకీల్ సాబ్ బాగానే ఆడాయి. తపపై నమ్మకంతోనే ఈ సినిమాపై దిల్ రాజు రూ.70 కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. అందులో సగం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కాబట్టుకోగలిగారు. కాకపోతే హీరోగా నితిన్ కి వరుసగా ఫ్లాపులు తగులుతున్నాయి. అవి కూడా మామూలు ఫ్లాపులు కాదు. డిజాస్టర్లు. వాటి నుంచి తేరుకోవాలంటే తమ్ముడు తో హిట్టు కొట్టడం ఒక్కటే మార్గం.
సిద్దార్థ్ సినిమా 3BHK కూడా ఈవారమే వస్తోంది. ఇది తమిళ డబ్బింగ్ బొమ్మ. అయితే సిద్దార్థ్ కి తెలుగులో అభిమానులు ఉన్నారు. తను మనకి తెలుగు హీరోనే. ట్రైలర్ హార్ట్ టచింగ్ గా ఉంది. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఓ కల. ఆ కల కోసం ఓ కుటుంబం ఎంత తాపత్రయపడుతుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు. అందరికీ త్వరగా కనెక్ట్ అయిపోయే పాయింట్ ఇది. ఫీల్ గుడ్ సినిమాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. ఆ సినిమాలు మెల్లగా జనంలోకి వెళ్తాయి. ఈ సినిమా కూడా అంతే అనిపిస్తోంది.
కుబేర, కన్నప్ప ఇచ్చిన హై.. ‘తమ్ముడు’ కొనసాగిస్తే టాలీవుడ్ కు కొత్త ఉత్సాహం రావడం ఖాయం. ‘తమ్ముడు’ ఓపెనింగ్స్ కూడా ఆశాజనకంగా ఉంటే, టాలీవుడ్ కి మళ్లీ కొత్త కళ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.