ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం కీలకమైన అడుగులు వేస్తోంది. నిందితుల అకౌంట్లలో ఉన్న డబ్బులను సీజ్ చేస్తోంది. దాదాపుగా ముఫ్ఫై కోట్ల రూపాయల నగదును సీజ్ చేసే ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసింది. ఇదంతా బ్యాంకుల్లో ఉన్న అమౌంట్. రాజ్ కెసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, వారి కంపెనీల ఖాతాల్లో ఉన్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.
మొదటి అడుగు మాత్రమే !
మద్యం స్కాంలో అక్రమంగా సంపాదించిన సొమ్ము, డమ్మీ డిస్టిలరీల ఖాతాల్లో ఉన్న నగదును జప్తు చేయడం మొదటి అడుగుగానే భావించవచ్చు. ఇప్పటికే ఇలాంటి సొమ్ము పలు కంపెనీల్లోకి ప్రవహించింది. దానికి తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి. భారతి సిమెంట్స్ లోకి.. పెద్దిరెడ్డి కంపెనీలోకి కూడా ఈ సొమ్ము తరలించిన ఆధారాలను కనిపెట్టారు. దానికి తగ్గట్లుగా సీజర్ ప్రక్రియలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. లిక్కర్ స్కాం చాలా పెద్దది.. ఆస్తుల జప్తు కూడా ఆ స్థాయిలో ఉండేలా సీఐడీ రంగం సిద్ధం చేసుకుంటోంది. అలాగే వందల కిలోల బంగారాన్ని కొనుగోలు చేసినట్లుగా రికార్డులు ఉన్నాయి. వాటిని బయటకు తేవాల్సి ఉంది.
షెల్ కంపెనీల గుట్టు రట్టు !
సీఐడీ సిట్ అధికారులు ఆర్థిక నిపుణులు, కేంద్ర ఆర్థిక అధికారుల సాయం కూడా తీసుకుని షెల్ కంపెనీల గుట్టు రట్టు చేశారు. దుబాయ్ వరకూ వెళ్లి విచారణ చేశారు. వాటి గుట్టు మొత్తం బయటపడింది. ఏ ఏ రూట్లలో డబ్బులు తరలించారు.. మళ్లీ ఎలా వైట్ రూపంలో తీసుకు వచ్చారో కుడా ఆధారాలు సేకరించారు. ఇక్కడే చాలా మంది అడ్డంగా దొరికిపోయారు. ఆ షెల్ కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయో.. వారి బినామీలు ఎవరు.. ఆ కంపెనీల నుంచి ఎవరికి అంతిమంగా డబ్బు చేరిందో కూడా లెక్కలు తీశారు. ఇప్పుడు అన్నింటినీ జప్తు చేసే ప్రక్రియ ప్రారంభించారు.
జప్తు ప్రక్రియలోకి త్వరలో ఈడీ కూడా !
లిక్కర్ స్కామ్లో జరిగిన క్యాష్ ఫ్లోపై ఇప్పటికే ఈడీ కూడా రంగంలోకి దిగింది. సైలెంటుగా గా కీలక దర్యాప్తును పూర్తి చేసింది. త్వరలో ఆస్తుల జప్తు ఉంటుందని చెబుతున్నారు. జప్తు చేసే ఆస్తులు వేల కోట్లలోనే ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎంత ఆర్గనైజ్డ్ గా క్రైమ్ నడిపారో.. అంతా బయట పెట్టనున్నారు. అధికారం చేతుల్లో ఉంటే క్రిమినల్స్ ఎలా విచ్చలవిడిగా స్కాములు చేయగలరో ఇదో ఉదాహరణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.