వైసీపీ వ్యూహకర్తలు రాజకీయంగా జరుగుతున్న పరిణామాల్ని, ప్రజాభిప్రాయాలను పట్టించుకోకుండా తాము అనుకున్నదే నిజం అనే భ్రమలో బతుకుతున్నారు. దానికి తగ్గట్లుగా వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నారు. ఓడిపోయి ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలని ఓ కార్యక్రమం పెట్టుకున్నారు. గతంలోలా ప్రజాధనాన్ని వాడలేరు.. బ్లాక్ మనీ బయటకు తీయలేరు కాబట్టి ఓ క్యూ ఆర్ కోడ్ తో పని పూర్తి చేస్తున్నారు. దాన్ని తీసుకెళ్లి స్కాన్ చేయిస్తే.. టీడీపీ మేనిఫెస్టో వస్తుంది. సహజంగా టీడీపీ నేతలు చేయాల్సిన పని అది. కానీ వైసీపీ చేస్తోంది. దాని వల్ల ఎవరికి లాభం ?
ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో
సూపర్ సిక్స్ హామీలు అమలు అవుతున్నాయా లేదా అన్నది ప్రజలకు స్పష్టత ఉంటుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ వైసీపీకి పెద్ద మైనస్ ఏమిటంటే అంతకు ముందు అన్న క్యాంటీన్లను జగన్ రెడ్డి సీఎం కాగానే తీసేశారు. తాము వస్తే తీసేయబోమని.. రాజన్న క్యాంటీన్లు అని పేరు మార్చుకుని కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో పార్టీ నేతలు నమ్మించారు. కానీ మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ అన్న క్యాంటీన్లు జోరుగా పని చేస్తున్నాయి. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. బుకింగ్ తో సంబంధం లేకుండా… నగదును మహిళల ఖాతాల్లో జమ చేయాలని తాజాగా నిర్ణయించారు. తల్లికి వందనం అమలు చేశారు. ఇది ప్రజల్లో మైలేజీ పెంచింది.
ప్రజల్ని బాదకుండా సూపర్ సిక్స్ హామీల అమలు
ఉచిత బస్ ను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి ఇస్తామని లోకేష్ కూడా ప్రకటించారు. అంటే సూపర్ సిక్స్ హామీలన్నీ దాదాపుగా అమలు అవుతున్నట్లే. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో సూపర్ సిక్స్ హామీలు అమలు అయిపోతే అంత కంటే కావాల్సింది ఏముంటుంది ?. ఇప్పుడు వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లి .. మీకు పెండింగ్ డబ్బులు ఇవ్వలేదు అని చెబితే.. జగన్ రెడ్డి ఇచ్చాడా అన్న ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడిని జగన్ రెడ్డి జూన్ కు మార్చి ఓ ఏడాది ఎగ్గొట్టారు. లబ్దిదారులు వైసీపీ కార్యకర్తలు మాత్రమే ఉండేవారు. అన్నింటికి మించి జగన్ రెడ్డి పథకాలు అమలు చేయడానికి అడ్డగోలుగా పన్నులు పెంచారు.
వైసీపీ పాలన గుర్తుకొస్తే ఉలిక్కి పడే ప్రజలు
జగన్ రెడ్డి పాలనను ప్రజలు ఇప్పుడల్లా మార్చిపోరు. అదే సమయంలో.. వైసీపీ మేనిఫెస్టోను బయటకు తీస్తే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాల పాటు దొంగ పాలన చేసి.. మేనిఫెస్టోను 99.8 శాతం అమలు చేశామని చెప్పుకున్నారు. కానీ కనీసం పది శాతం హామీలు కూడా అమలు చేయలేదని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి.. వారిపై కోపంతో.. ప్రజలు మళ్లీ తమకు ఓటు వేయాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. కానీ ఈ మేనిఫెస్టో ప్రచారం టీడీపీకే ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే శాంతిభద్రతల దగ్గర నుంచి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వరకూ అన్నీ మెరుగుపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.