జగన్మోహన్ రెడ్డి వ్యాపార భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ … రస్ అల్ ఖైమా దేశానికి చెందిన రాకియా సంస్థను మరోసారి మోసం చేశారు. ఆ సంస్థ హైదరాబాద్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. రస్ అల్ ఖైమా దేశ కోర్టు ఉత్తర్వుల మేరకు దిగువ కోర్టులో.. నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన కంపెనీల ఆస్తుల బదలాయింపు జరగదని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీలను ఉల్లంఘించి ఆస్తులను బదలాయించేశారు. దీనిపై రాకియా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ రాకియా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ విచారణకు నిమ్మగడ్డ తరపున వైసీపీ రాజ్యసభ ఎంపీ, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను వాదించే లాయర్ నిరంజనా రెడ్డి హాజరయ్యారు. రాకియా తమ దేశంలో కోర్ట్ నుంచి ఏకపక్షంగా ఉత్తర్వులు తెచ్చుకుందని వాదించారు. తాము దిగువ కోర్టులో ఇచ్చిన హమీద్, ఉత్తర్వులను ఉల్లంఘించలేదని మాత్రం వాదించలేదు. విచారణ వాయిదా పడింది.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ సహా చాలా ప్రాజెక్టులు చేపట్టారు. అందులో ఇన్వెస్ట్ మెంట్స్ అంటూ.. రస్ అల్ ఖైమా ప్రభుత్వ సంస్థ అయిన రాకియా నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు. వాటిలో ఎక్కువ భాగం జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా మళ్లించారు. వైఎస్ చనిపోవడంతో మొత్తం రివర్స్ అయింది. వాన్ పిక్ ప్రాజెక్టు రద్దు అయింది. రాకియాను నిమ్మగడ్డ మోసం చేశారు. ఓ సారి సెర్బియా పర్యటనకు నిమ్మగడ్డ వెళ్లడంతో అక్కడ ఇంటర్ పోల్ సాయంతో రస్ అల్ ఖైమా నిర్బంధించింది. చాలా కాలం నిర్బంధంలో ఉన్న తర్వాత కరోనా పుణ్యమా అని వదిలి పెట్టారు.
అప్పట్లో సెటిల్మెంట్ కు.. డబ్బులు చెల్లించేందుకు నిమ్మగడ్డ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తీరా వచ్చాక ఇక్కడ కంపెనీల పేరుపై ఉన్న ఆస్తుల యాజమాన్య హక్కులు బదలాయించుకుంటున్నారని.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది.