ఐపీఎస్ అధికారి సిద్ధార్ధ కౌశల్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసినట్లుగా వైసీపీ మీడియా ప్రచారం చేస్తోంది. ఆయన నెల రోజులుగా ఆఫీసుకు వెళ్లడం లేదని.. వీఆర్ఎస్ దరఖాస్తు చేశారని ప్రభుత్వ వేధింపులే కారణం అని వైసీపీ మీడియా అంటోంది.
సిద్ధార్థ కౌశల్ .. ఇప్పుడు డీజీపీ ఆఫీసులో అడ్మిన్ ఎస్పీగా ఉన్నారు. అంటే డీజీపీకి అత్యంత నమ్మకస్తుడు అన్నమాట. మరి వేధింపులు ఎక్కడి నుంచి వచ్చాయి ?. వైసీపీ హయాంలో ఆయన మూడు జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఆయనపై టీడీపీ ఎప్పుడూ పెద్దగా ఆరోపణలు చేయలేదు. ప్రభుత్వం మారినా ఆయనకు పోస్టింగులు దక్కుతూనే ఉన్నాయి. పోస్టింగ్ లేకుండా ఒక్క రోజు కూడా లేరు. ఆయనపై ఎలాంటి విచారణలు జరగడం లేదు కూడా. మరి ఆయనపై వేధింపులు ఎక్కడ ఉన్నాయి.. ఎందుకు వీఆర్ఎస్ తీసుకుంటారు?
గత ప్రభుత్వంలో వైపీఎస్లుగా వ్యవహరించి కేసులు పాలవుతున్న ఐపీఎస్ అధికారులే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేయడం లేదు. అంటే వారిని వేధించడం లేదని అనుకుంటున్నట్లేగా?. కొల్లి రఘురామిరెడ్డి నుంచి పీవీ సునీల్ కుమార్ వరకూ తప్పుడు పనులు చేసి అడ్డంగా సాక్ష్యాలతో సహా దొరికిన వారు వీఆర్ఎస్ తీసుకోవడం లేదు. ఆ ఆలోచన కూడా చేయడం లేదు. కేవలం ఐపీఎస్ అధికారులు,చాలా సర్వీస్ ఉందన్న సానుభూతి చూపించుకుని.. కొంత మందితో ఒత్తిళ్లు చేయించుకుని .. పోస్టింగులు లేకపోయినా పర్వాలేదు.. చర్యలు తీసుకోకపోతే చాలన్నట్లుగా కొంది గుట్టుగా ఉంటున్నారు. మరి వారందరి విషయంలో ప్రభుత్వం కరెక్ట్ గా వ్యవహరిస్తున్నట్లే అనుకోవాలి.
సిద్ధార్ధ కౌశల్ వీఆర్ఎస్ నిజమే అయితే.. ఎందుకో ఆయన చెప్పాల్సి ఉంటుంది. ఆయన వీఆర్ఎస్ ను అడ్డం పెట్టుకుని .. వైపీఎస్లకు మద్దతుగా వాదనలు వినిపిస్తే.. ఏం ప్రయోజనం ఉంటుంది ?