సినిమాల్లో రావాలనుకునే కొత్త వారికి గైడెన్స్ ఇవ్వడానికి ‘దిల్ రాజు డ్రీమ్’ ఏర్పాటు చేశామని ఇటీవలే ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. కొత్తవారికి గైడెన్స్ సంగతి పక్కన పెడితే, సొంతవాళ్లకి ఆయన సరైన గైడెన్స్ ఇవ్వడం మర్చిపోయారు. దిల్ రాజు నిర్మించిన ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ కోసం టీంలో అందరూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన బ్రదర్ శిరీష్ కూడా ఛానెల్స్ ముందుకు వచ్చారు. నిజానికి శిరీష్ ఎప్పుడూ కెమెరా ముందు రారు. ఈవెంట్స్‌లో కూడా మాట్లాడరు. కానీ ‘సంక్రాంతికి’ సక్సెస్ మీట్లో తొలిసారిగా మైక్ అలవాటు చేసుకున్నారు. మొన్న దిల్ రాజు డ్రీమ్స్ ఈవెంట్లో కూడా మాట్లాడారు.
అయితే వేదికలపై మాట్లాడటం వేరు. ఇంటర్వ్యూలు ఇవ్వడం వేరు. వివాదాలకు చోటు ఇవ్వకుండా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పేటప్పుడు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఎలాంటి ఎత్తుగడతో ప్రశ్న వేశారో ముందే కనిపెట్టాలి. ఒకవేళ పొరపాటుగా ఓ మాట దొర్లినా దాన్ని ఎడిటింగ్ (రికార్డింగ్)లో సరిదిద్దమని చెప్పాలి. సబ్జెక్ట్‌కి కట్టుబడి ఉండాలి. వాడుతున్న భాషపై పట్టు ఉండాలి. అనవసరమైన పోలికలు తీసుకురాకూడదు. ఒక విషయాన్ని స్మూత్‌గా చెప్పాలి. డైవర్షన్ ప్రశ్నలు వస్తున్నప్పుడు — ‘మంచి ప్రశ్న. దీనిపై మరో సమయంలో మాట్లాడుకుందాం’ అనే సమాధానం అటు ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని కూడా సంతోషపెడుతుంది. అన్నిటికంటే ముఖ్యం… లౌక్యం ఉండాలి.
దిల్ రాజు అద్భుతమైన వక్త కాదు కానీ లౌక్యం తెలిసిన మనిషి. మీడియా ముందుకు వచ్చేటప్పుడు సబ్జెక్ట్‌ని బలంగా ఫిక్స్ అయిపోతాడు. మిగతా విషయాల మీద రియాక్ట్ అయినప్పుడు కూడా ఆయన సమాధానాలు చాలా తెలివిగా ఉంటాయి. ఆయన ఎప్పుడూ కూడా ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడు. పబ్లిక్ స్పీకర్స్ నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం ఇది. మరి ఇంత తెలిసినా దిల్ రాజు… తన బ్రదర్ శిరీష్‌కి ఏం గైడెన్స్ ఇచ్చినట్లు?
శిరీష్ మాట్లాడిన మాటలు ఎంత రచ్చకు దారితీశాయో అందరికీ తెలుసు. తమ్ముడు ప్రమోషన్స్ కాకుండా ‘గేమ్ చెంజర్’ పోస్ట్‌మార్టమ్ అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. నిజానికి శిరీష్ చేసిన కామెంట్స్ అధిక ప్రసంగం. నక్క నాగలోకం అంటూ ఓ పోలిక తీసుకొచ్చారు. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా ఇచ్చిన సంస్థ ఆయనకి నక్కలా కనిపించింది. దేనికొచ్చిన పోలిక ఇది? ఒక సంస్థని పొగడాలి అంటే ఇంకో సంస్థని తగ్గించడం మూర్ఖత్వం కాకపోతే మరేమిటి? ఇలాంటి బేసిక్ కామన్ సెన్స్ లేకుండా మీడియా ముందుకు రాకూడదు. మైత్రీతో ఎస్వీసీకున్న విబేధాల్ని, రెండు సంస్థల మధ్య ఉన్న దూరాన్ని కొలిచి మరీ చెప్పే పోలిక ఇది. తెలుగు చిత్రసీమలో ఇవి రెండూ పెద్ద సంస్థలే. వీటి మధ్య వైరం ఆ సంస్థలకే కాదు… చిత్రసీమకూ మంచిది కాదు.
గేమ్ చెంజర్ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ తమని ఎలా ఉన్నామని కూడా పలకరించలేదని ఇంకో ఎక్స్ట్రా కామెంట్ కొట్టారు శిరీష్. ఇప్పుడు ఆ పాత గాయాన్ని రేపి ఆయన ఏం లాభం పొందాలని చేస్తున్నారో ఆయకే తెలియాలి. గేమ్ చెంజర్ విషయంలో దిల్ రాజు చాలా బాధపడ్డారు. ‘ సినిమా నా చేతిలో లేకుండా పోయింద’ని చెప్పారు. అలాంటి కంట్రోల్ లేని సినిమా తీసి జనాల మీదకి వదలడం నిర్మాతల తప్పు. దీనికి హీరో ఏం చేయాలి? ఫ్యాన్స్ ఇదే ప్రశ్న వేస్తున్నారు. ‘హిట్ సినిమా వస్తే మా వల్లే హిట్ అయ్యిందని చెప్పుకునే మీరు ఫ్లాప్ సినిమాని ఎవరి మీదకి తోసేస్తారు? ఎవరిని బాధపెట్టడానికి పదేపదే అదే సినిమా గురించి మాట్లడుతున్నారు? రామ్ చరణ్ గురించి గానీ, ‘గేమ్ ఛేంజర్’ గురించి గానీ ఇంకోసారి తప్పుగా మాట్లాడితే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది” అని ఓ మెగా ఫ్యాన్స్ ఓ హెచ్చరిక చేశారు.
ఆ తరవాత తన తప్పు తెలుసుకొన్న శిరీష్.. ‘సారీ’ అంటూ ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ… అడుసు తొక్కడం ఎందుకు? ఆ తరవాత కాళ్లు కడుక్కోవడం ఎందుకు అనేదే ప్రశ్న. ఈ ‘సారీ’ కంటే ఆయన చరణ్ పై చేసిన కామెంట్లే మెగా ఫ్యాన్స్ కు ఎక్కువ గుర్తుంటాయి. దిల్ రాజు కూడా ‘తమ్ముడు ప్రమోషన్స్ జరుగుతోంటే.. గేమ్ ఛేంజర్ గురించి ప్రశ్నలు అడుగుతారెందుకు? ఎప్పుడో ఆరు నెలల సినిమా గురించి ఇప్పుడెందుకు’ అని మరో ఇంటర్వ్యూలో ఆవేశ పడ్డాడు. ఇదంతా తమ్ముడు (శిరీష్) ఎఫెక్ట్. ఇదే దిల్ రాజు. తన ఇంటర్వ్యూలలో ‘గేమ్ చేంజర్’ ప్రశ్నలకు నవ్వుతూనే విశ్లేషణాత్మక సమాధానాలు ఇచ్చారు. తన సినిమాని తానే పోస్ట్ మార్టమ్ చేశారు. తనని అడిగేటప్పుడే ‘గేమ్ చేంజర్ గురించి ఇప్పుడు ఎందుకు’ అనేసి ఉంటే సరిపోయేది కదా. శిరీష్ మాటల ప్రభావం ఎంత వరకూ ఉంటుందో దిల్ రాజుకీ తెలుసు. అందుకే ఆయనా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు.
నిజానికి ఈ సమయంలో ఇది అనవసరమైన గొడవ. దీని వలన వారి తమ్ముడు సినిమాకి నయాపైసా ప్రయోజనం లేదు. పైగా మెగా ఫ్యాన్స్ నుంచి బోలెడు నెగిటివిటీ మూటగట్టుకున్నారు. శిరీష్ ఏం మాట్లాడతారో దిల్ రాజుకి ఐడియా లేకపోవచ్చు. కానీ మీడియాతో అనుభవం ఉన్న వ్యక్తిగా తొలిసారి ఇంటర్వ్యూలకు సిద్ధమైన శిరీష్‌కి ఆయన కొంత గైడెన్స్ ఇవ్వాల్సింది. అది జరిగినట్లు కనిపించలేదు. ఒకవేళ దిల్ రాజు కూడా శిరీష్ కామెంట్స్ విషయంలో హ్యాపీగా ఉంటే మాత్రం… ఇదంతా కావాలనే చేస్తున్న ప్రొపగాండాగా భావించక తప్పదు.