ఏపీ ఐపీఎస్ అధికారి సిద్దార్థ కౌశల్ వీఆర్ఎస్ తీసుకోవడంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అదంతా బేస్ లెస్ అని అధికారిక ప్రకటన ఇచ్చారు. తన దీర్ఘ కాలిక లక్ష్యాలు, కుటుంబ సభ్యుల కోరిక మేరకు వీఆర్ఎస్ తీసుకున్నానని తెలిపారు. ప్రభుత్వ వేధింపులు అని కొంత మంది ప్రచారం చేస్తూండటంతో ఈ క్లారిటీ ఇచ్చారు.
2000 బ్యాచ్‌కు చెందిన సిద్దార్థ కౌశల్‌కు ఇంకా ఇరవై ఏళ్లకుపైగా సర్వీస్ ఉంది. అయితే ఆయన కుటుంబం ఢిల్లీలో ఉంటుంది. ఏపీ క్యాడర్ లో పని చేయాల్సి రావడం వల్ల ఆయన కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో కౌశల్ విద్యార్హతులు ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో చదువుకున్నవి. కార్పొరేట్ కంపెనీల నుంచి బడా ఆఫర్లు ఉన్నాయి. దీంతో ఆయన ప్రైవేటు రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కుటుంబం కూడా ఇదే విధంగా ఒత్తిడి చేయడంతో ఆయన ఐపీఎస్ సర్వీస్ నుంచి వైదొలిగి కార్పొరేట్ సంస్థలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం ఐజీ ర్యాంక్ లో ఉన్నారు. డీజీపీ ఆఫీసులో అడ్మిన్ వ్యవహారాలు చూస్తున్నారు. అయితే రాను రాను ఐపీఎస్ సర్వీస్ రాజకీయ ఒత్తిళ్లతో అనే సవాళ్లకు కేంద్రంగా మారుతూండటంతో పాటు.. వచ్చే జీతభత్యాలు కూడా కార్పొరేట్ తో పోలిస్తే చాలా తక్కువ కావడంతో సిద్దార్థ కౌశల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది ఐపీఎస్ అధికారులు..వైసీపీ హయాంలో చేసిన తప్పుడు పనులతో కేసులు, విచారణలు ఎదుర్కొంటున్నారు. కానీ సిద్దార్థ కౌశల్‌కు అలాంటి ట్రాక్ రికార్డు లేదు.