‘ఐకాన్’.. ఈ టైటిల్ చాలా కాలంగా తెలుగు సినీ అభిమానుల నోట్లో నానుతూనే ఉంది. అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ కలయికలో ఈ సినిమా రావాల్సింది. కానీ కుదర్లేదు. అప్పట్నుంచి ‘ఐకాన్’ పేరు వినిపిస్తూనే ఉంది. బన్నీనే తన పేరుకు ముందు ‘ఐకాన్ స్టార్’ అని పెట్టుకొన్నారు. అలా.. ‘ఐకాన్’కి గుర్తింపు వచ్చింది. తాజాగా అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాకు ‘ఐకాన్’ అనే పేరు పెట్టారని, త్వరలోనే ప్రకటిస్తారని చెప్పుకొంటున్నారు. ‘ఐకాన్’ పాన్ ఇండియాకు సరిపడా టైటిల్. పైగా క్యాచీగానూ వుంది. కాబట్టి…ఈ పేరే ఖాయం చేసే అవకాశాలు కనిపించాయి.
అయితే ఈ టైటిల్ వేణు శ్రీరామ్ దగ్గర వుంది. ఆయన ఇస్తేనే టైటిల్ పెట్టుకొనే ఛాన్స్ వుంది. లేదంటే లేదు. ఇప్పటి వరకూ వేణు శ్రీరామ్ ని చిత్రబృందం సంప్రదించలేదు. టైటిల్ కావాలని అడగలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ టైటిల్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే తన కథని ఆయన తెరపై ఎప్పటికైనా చూడాలనుకొంటున్నారు. బన్నీ ప్లేస్ లో మరో హీరోతో ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి దశలో ‘ఐకాన్’ టైటిల్ ఇవ్వడానికి ఆయన ఇష్టపడకపోవొచ్చు.
కాకపోతే.. ‘ఐకాన్’ తప్ప తన సినిమాకు మరో టైటిల్ నప్పదు అని బన్నీ గనుక భావిస్తే ఈ టైటిల్ చేజిక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదు. దిల్ రాజుని అడిగితే ఆయన కాదనకుండా ఇచ్చేస్తారు. అప్పుడు వేణు శ్రీరామ్ కొత్త టైటిల్ వెదుక్కోవాలి. కాకపోతే ఇప్పటి వరకూ టైటిల్ గురించి వేణు శ్రీరామ్ ని గానీ దిల్ రాజుని గానీ ఎవరూ సంప్రదించలేదు. అంటే.. అట్లీ టీమ్ మరో టైటిల్ కోసం అన్వేషిస్తోందేమో?