వైసీపీలో సింగయ్య మృతి కేసు టెన్షన్స్ రేపుతోంది. అది రోడ్డు ప్రమాదం కేసు. పైగా జగన్ డ్రైవింగ్ చేయడం లేదు. కానీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఉంది. పోలీసుల ఆంక్షల్ని ఉల్లంఘించిన వ్యవహారం ఉంది. అయితే జగన్ పై ఉన్న ఇతర కేసులతో పోలిస్తే ఇదేమీ భారీ కేసు కాదు. మరి ఎందుకు వైసీపీ ఇంత భయపడుతోంది. వ్యవస్థలపై దండెత్తుతోంది. పేద కుటుంబాలను పావులుగా వాడుకుంటోంది ?.
కోర్టుకెళ్లి దర్యాప్తు చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్న జగన్
సింగయ్య మృతి కేసులో జగన్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ శ్రీనివాసరెడ్డి బెంచ్ రెండు వారాల పాటు అసలు దర్యాప్తే ఆపేయాలని ఆదేశించింది. తమకు విచక్షణాధికారం ఉందని అభ్యంతరం వ్యక్తం చేసిన ఏజీతో న్యాయమూర్తి అన్నారు. ఆ వెంటనే బాధితుల్ని పిలిపించుకున్నారు జగన్. వారికి ఆర్థిక సాయం హామీ ఇచ్చి.. రివర్స్ లో రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కపెట్టడానికి చాలా పెద్ద స్థాయిలోనే మంత్రాంగాన్ని జగన్ నడిపించారు. ఎందుకింత భయపడుతున్నారు.
అరెస్టు తప్పదన్న భయంతోనే ఇదంతా చేస్తున్నారా ?
మిగతా కేసుల సంగతేమో కానీ.. ఈ కేసులో అరెస్టు చేస్తారన్న భయంతోనే జగన్ ఇదంతా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ ఈ కేసులో జగన్ ను అరెస్టు చేయాలని పోలీసులు కూడా అనుకోరు. ఎందుకంటే ఈ కేసులో స్వయంగా డ్రైవర్ అయిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. మరి జగన్ ను ఎందుకు అరెస్టు చేస్తారు. నేరుగా క్వాష్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏమిటి? . అంటే ఈ కేసులో ఇంకేదో ఉందన్నమాట. అదేమిటో జగన్ అండ్ కోల్ తెలియాలి. అది జగన్ రెడ్డిని వెంటాడుతోందని భయపడుతున్న తీరుతో అర్థం చేసుకోవచ్చు.
చట్టాలను కొంత కాలమే మేనేజ్ చేయగలరు !
జగన్ రెడ్డి చేసే ప్రతి నేరం.. ప్రజల కళ్ల ముందే ఉంది. చట్టం కళ్ల ముందే ఉంది. కానీ ఆయన చట్టంలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని ఎప్పటికప్పుడు వాటిని నిలుపుదల చేసుకుంటున్నారు. కానీ బయటపడలేకపోతున్నారు. బయటపడటం అసాధ్యం. ఇవాళ కాకపోతే రేపు అయినా ఆయన నేరాలకు శిక్ష పడుతుంది. జయలలిత లాంటి నేతలే తప్పించుకోలేకపోయారు. అయినా నేరాల మీద నేరాలు చేసి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు.