రాయచోటిలో తలదాచుకున్న ఇద్దరు తమిళనాడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అక్కడి ఏటీఎస్ స్క్వాడ్ అరెస్టు చేసింది. ఇంటలిజెన్స్ ఇన్ పుట్స్ సాయంతో ఏపీ పోలీసులు, తమిళనాడు ఏటీఎస్ ప్రత్యేకంగా నిఘా పెట్టి ఇద్దర్ని పట్టుకున్నారు. వారిని తమిళనాడు కోర్టులో హాజరు పరిచారు. తర్వాత పోలీసులు రాయచోటిలో ఆ తీవ్రవాదులు షెల్టర్ తీసుకున్న ప్రాంతంలో సోదాలు చేస్తే భారీగా పేలుడు పదార్ధాలు దొరికాయి.
ఆ ఇద్దరు ఉగ్రవాదులు చాలా కాలంగా నేరాల్లో ఉన్నారు. కోయంబత్తూరులో అద్వానీ హత్య కోసం బాంబులు కూడా పెట్టారు. ఇద్దరిపై కనీసం పదికిపైగా ఉగ్ర కేసులు ఉన్నాయి. వారు కొన్నాళ్ల కిందట హఠాత్తుగా తమిళనాడు నుంచి అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కనిపెట్టడం తమిళనాడు ఏటీఎస్‌కు సాధ్యం కాలేదు. వారు రాయచోటికి వచ్చి సెటిలైపోయారు. ఐదు సంవత్సరాల పాటు వారి గురించిన చిన్న సమాచారం బయటకు పోలేదు. వారికి రాయచోటిలో అన్ని గుర్తింపుకార్డులు వచ్చాయి.
రాయచోటిలో వారు ఉగ్రకార్యకలాపాలు కొనసాగించారు. కనీసం రెండు వందల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇటీవల రాయచోటిలో మత ఘర్షణలు జరిగాయి. అయ్యప్ప స్వాములపై దాడులు చేశారు. ఇలాంటివి జరగడంతో అనుమానం వచ్చిందేమో ఏమో కానీ.. ఇంటలిజెన్స్ పూర్తి స్థాయిలో నిఘా పెట్టడంతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఆచూకీ దొరికింది. అరెస్టు చేశారు.
స్థానికంగా ఎవరి సపోర్టు లేకుండా వారిద్దరూ తలదాచుకుని ఉగ్రశిక్షణ ఇస్తారని ఎవరూ అనుకోలేరు. గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. అంటే ఆ టెర్రరిస్టులకు లోకల్ గా ఎవరో సపోర్టు చేశారు. వారి సంగతి తేలిస్తే.. మొత్తం వ్యవహారం బయటపడే అవకాశం ఉందని.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.