విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ .. ఏపీ పిల్లల భవిష్యత్ ను ప్రణాళికా అద్దంగా మార్చేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడాది కాలంలోనే గతంలో గాడి తప్పిన వ్యవస్థను గాడినా పెట్టే ప్రయత్నం చేశారు. ఏ మాత్రం కసరత్తు లేకుండా సీబీఎస్ఈ, ఇంగ్లిష్ మీడియాం, ఐబీ అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచారు. రంగుల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టారు కానీ ఒక్క టీచర్ ను నియమించలేదు. ఈ పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో మార్చేందుకు నారా లోకేష్ తొలి రోజు నుంచే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
స్కూళ్లను మెరుగుపరచడానికి టీచర్ల నుంచే సలహాలు
స్కూళ్లను మెరుగుపర్చాలంటే.. ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న టీచర్ల వల్లే అవుతుందని నారా లోకేష్ గట్టి నమ్మకం. కర్నూలు జిల్లాలో ఓ ఏకోపాధ్యాయ స్కూల్ టీచర్ .. తన స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దిన విషయాన్ని తెలుసుకుని ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ప్రభుత స్కూళ్లను సంస్కరించాలంటే ఏం చేయాలో.. ఆమె దగ్గర నుంచి సలహాలు తీసుకున్నారు. వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకు కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. ఇలా.. ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులను..నారాలోకేష్ గుర్తించి వారి సలహాలు తీసుకుంటున్నారు.
స్కూళ్లపై రాజకీయ ప్రభావం లేకుండా చర్యలు
ఏడాదిలో విద్యాశాఖలో పెను మార్పులు వచ్చాయి. విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల భారం తగ్గించడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, విద్యా నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టారు. విద్యాశాఖలో రాజకీయ ప్రభావాన్ని తొలగించాలని నిర్ణయించారు. విద్యా కార్యక్రమాలు లేదా విద్యార్థులకు అందించే సామగ్రిపై రాజకీయ నాయకుల ఫోటోలు లేదా పార్టీ రంగులు ఉండకుండా నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు హాజరయ్యేలా ఒత్తిడి చేయకుండా, వారి విద్యపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జాబ్ ఫెయిర్లు తప్ప ఇతర రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లకూడదని ఆదేశించారు. జూనియర్ కాలేజీ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు.
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య
ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేలా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. టీచర్స్, పేరెంట్స్ మీటింగ్స్ పెడుతున్నారు. విద్య నాణ్యతను మెరుగుపరచడానికి కొత్త కరికులం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని CBSE తరహాలో ప్రవేశపెట్టడం తో పాటు జనవరి నాటికి ప్రీ-ఫైనల్ పరీక్షలను పూర్తి చేయాలని ప్రతిపాదించారు. గతంలో ఉపాధ్యాయులు బహుళ యాప్ల వినియోగం వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించడానికి, వాటి తప్పనిసరి వినియోగాన్ని తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. 16,000 కంటే ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ ఇచ్చారు. త్వరలో నియామకాలు పూర్తి అవుతాయి.
మొత్తంగా విద్యాశాఖలో నారా లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది.