కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి పోరాడిన వ్యక్తి డీకే శివకుమార్. అయితే కాంగ్రెస్ మార్క్ రాజకీయంలో ఆయనకు ముఖ్యమంత్రి పదవి రాలేదు. మాజీ సీఎం సిద్ధరామయ్యకే చాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత.. తాను పూర్తి కాలం పదవిలో ఉండనని చివరి సారిగా పదవి చేపట్టి రిటైర్ అయిపోతానన్నారు. మొదటి రెండేళ్లు మాత్రమే ఉంటానని తర్వాత శివకుమార్ కు సీఎం చాన్స్ ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు. పార్టీ హైకమాండ్ అదే చెప్పి శివకుమార్ ను బుజ్జగించింది. డిప్యూటీగా ఉండబోనని చెప్పినా ఒప్పించింది.
సిద్ధరామయ్య పాలనలో అనేక సమస్యలు వస్తున్నా.. ఆయన అనేక వివాదాల్లో ఇరుక్కున్నా హైకమాండ్ సపోర్టు చేస్తూ వస్తోంది. ఇప్పుడు తన సంగతేమిటని శివకుమార్ ప్రశ్నిస్తున్నా మాట్లాడటం లేదు. సిద్ధరామయ్యను మార్చి శివకుమార్ ను సీఎం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా అదే చెబుతున్నారు. సీఎం మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుదంని పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. ఆయనే అధ్యక్షుడు అయినప్పుడు హైకమాండ్ ఏమిటన్న సెటైర్లు వచ్చాయి. ఇప్పుడు సీఎం మార్పు లేదని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతోంది.
పార్టీ కోసం కష్టపడిన నేతల్ని.. అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డిన వారిని హైకమాండ్ ఎప్పుడూ పక్కన పడేస్తోంది. తెలంగాణలో తప్పక రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించారు కానీ ఆయనకు స్వేచ్ఛ లేకుండా చేశారు. ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి దిగజారిపోతున్నా.. లైట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో హైకమాండ్ నిర్ణయాలు గందరగోళంగా మారాయి.