‘ఓజీ’, ‘అఖండ 2’…. 2025 ద్వితీయార్థంలో రాబోతున్న పెద్ద సినిమాల్లో ఇవి రెండూ ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై అభిమానులతో పాటు చిత్రసీమ కూడా ఆశలు పెట్టుకొంది. అయితే ఈ రెండూ.. ఒకేసారి విడుదల కాబోతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సెప్టెంబరు 25న ఓజీని విడుదల చేస్తున్నామని ఇది వరకే నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. నిన్నటికి నిన్న మరోసారి గట్టిగా కన్ఫామ్ చేశారు. సెప్టెంబరు 25న ఓజీ రావడం ఖాయమని అభిమానులకు తీపి కబురు అందించారు. ‘అఖండ 2’ కూడా ముందు నుంచీ సెప్టెంబరు 25పైనే గురి పెట్టింది. ‘ఓజీ’ రిలీజ్ డేట్ పై చిత్రబృందం అంత గ్యారెంటీగా ఉందంటే, అఖండ 2 రాదేమో అనుకొన్నారంతా.
కానీ ఇప్పుడు ‘అఖండ 2’ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. అందులో విడుదల తేదీ మరోసారి స్పష్టం చేసింది చిత్రబృందం. సెప్టెంబరు 25నే విడుదల అంటూ వాళ్లూ క్లారిటీగానే ఉన్నారు. దాంతో పవన్ – బాలయ్య క్లాష్ ఎలా ఉండబోతోంది? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది చిత్రసీమ.
సంక్రాంతికి రెండు మూడు సినిమాలు రావడం చూస్తూనే ఉన్నాం. కానీ అప్పుడు కూడా ఒక రోజు గ్యాప్ ఉంటుంది. ఇక్కడ అలా లేదు. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం అభిమానుల పరంగా ఆసక్తి ఉన్నా, సినిమాకు మంచిది కాదు. ఓపెనింగ్ డే ఎఫెక్ట్ తప్పకుండా పడుతుంది. థియేటర్లు పంచుకోవాల్సివస్తుంది. దాంతో పాటు కలక్షన్లు కూడా. అయినా సరే, రెండు సినిమాలూ పోటీకి సిద్ధమయ్యాయి అంటే.. ఆలోచించుకోవాల్సిందే.
నిజానికి ‘విశ్వంభర’ కోసం కూడా ఇదే డేట్ పరిగణించారు. ‘ఓజీ’ రాకుండా ‘విశ్వంభర’ వచ్చేదే. కానీ ‘ఓజీ’ ఫిక్సయ్యింది. దాంతో పాటు ‘అఖండ 2’ కూడా. దాంతో విశ్వంభర మరో డేట్ చూసుకోక తప్పదు.