కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చాక ఇక అంతా సెట్ రైట్ అనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు మరింత ఎక్కువ స్వేచ్ఛ వచ్చినట్లుగా కొంత మంది రెచ్చిపోతున్నారు. కొండా దంపతులు పెట్టిన చిచ్చు ఓ రేంజ్ లో ఉంది. అది వరంగల్ కాంగ్రెస్ లో ఎప్పుడు ఆరుతుందో తెలియదు కానీ.. కొత్తగా జడ్చర్ల ఎమ్మెల్యే కోవర్టులు అంటూ కొత్త మాటలు ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని .. వారి ఇళ్లకు నల్లా, కరెంట్ బంద్ చేస్తే వారే బనకచర్లను ఆపేస్తారని కామెంట్స్ చేస్తారు. ఆయన ఉద్దేశంలో బనకచర్లను కట్టే కాంట్రాక్టర్లు.. చంద్రబాబు కోవర్టులు అన్నమాట. అనిరుథ్ రెడ్డి వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేసినట్లుగా ఉండటంతో గగ్గోలు రేగింది. ఓ వైపు బీఆర్ఎస్ నేతలు కార్నర్ చేస్తూంటే.. వారికి బలం ఇచ్చేలా అనిరుథ్ రెడ్డి మాట్లాడటంతో రాష్ట్ర నాయకత్వం అసహనం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా పార్టీని ఇబ్బంది పెట్టేలా ఇలాంటి ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ అనిరుథ్ రెడ్డి గతంలో పది మంది ఎమ్మెల్యేలను పోగేసి ప్రైవేటుగా మీటింగ్ పెట్టి.. దాన్ని లీక్ చేసి..ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేశారు. కాంట్రాక్టర్ అయిన ఆయనకు ప్రభుత్వం వచ్చినా బడా కాంట్రాక్టులేమీ దక్కలేదన్న అసంతృప్తి.. ఎక్కువ పనులు పొంగులేటికి చెందిన కంపెనీలు తీసుకుంటున్నాయన్న కోపంతో ఆయన ఈ ముఠా రాజకీయాలు ప్రారంభించారు. అప్పట్లో సర్దుబాటు అయినా మరోసారి ఇప్పుడు బనకచర్ల ఇష్యూలో బీఆర్ఎస్ వాదనను సమర్థిస్తూ రచ్చ ప్రారంభించారు.