బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ .. ఫామ్ హౌస్ నుంచి యశోదా ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ చెకప్ కోసం వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకుంటున్నారు. వాటికి అదనంగా ఈ సారి యశోదాలు పరీక్షలు చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గత నెలలో నందినగర్ నివాసంలో మూడు రోజుల పాటు ఉండి.. ఉదయం, సాయంత్రం టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చారు.
కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. అందుకే పూర్తి స్థాయిలో టెస్టులు చేయించుకుని.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా వైద్యం తీసుకుని ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వయసు 70 ఏళ్లు దాటిపోవడంతో ఆరోగ్య పరంగా ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని .. ఈ విషయంలో కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. ఆ తర్వాత మళ్లీ రజతోత్సవ సభలోనే పాల్గొన్నారు. ఇక రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనడం లేదు. కానీ ప్రజల్లోకి వచ్చేందుకు భారీ ప్రణాళికలు వేస్తున్నట్లుగా మాత్రం చెబుతున్నారు.