ఇండోసోల్ సంస్థ ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామంలో భూసేకరణకు ప్రయత్నించింది. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 4,500 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తోంది, దీనికి స్థానిక గ్రామస్థులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కరేడు గ్రామస్థులు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా ముందుకు వెళితే హైవే దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
కందుకూరులో ఇండో సోల్ కంపెనీకి మరింత భూమి కోసం భూసేకరణ కోసం ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ వివాదం స్థానిక రైతులు మరియు గ్రామస్థుల ఆందోళనలకు సంబంధించినది, వారు తమ భూములను కోల్పోతామనే భయంతో నిరసనలు చేస్తున్నారు. అసలు ఇండోసోల్ ప్రాజెక్టుపై టీడీపీ గతంలో విమర్శలు చేసింది. ఈ కంపెనీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ. ఇది జగన్ బినామీ అని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. కడపకు చెందిన జగన్ రెడ్డి బంధువులు, వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితులదని చెబుతున్నారు.
అసలు ఆ సంస్థకు వేల ఎకరాల్లో ప్లాంట్ పెట్టే సామర్థ్యం ఉందోలేదో తెలియదు. ఆ సంస్థపై ఆరోపణలు చేసి ఇప్పుడు పెట్టుబడుల ప్రతిపాదనలతో వస్తే వేల ఎకరాలు సేకరించి ఇవ్వాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయడం మాత్రం చాలా మందికి విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రజలు వ్యతిరేకిస్తున్నా.. భూసేకరణ చేయాలనుకోవడం మంచిది కాదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఇంచ్ సోల్ కోసం భూసేకరణ అంశం రాజకీయ వివాదం అయ్యేలా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దూకుడుగా ఉన్నారు. కానీ ఇది వైసీపీ మాత్రం ఈ భూసేకరణ సమస్యపై మాట్లాడటం లేదు. అది వారి పార్టీ బినామీగా ఉంది కాబట్టే ఆ పార్టీ కూడా సైలెంటుగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.