Thammudu movie review
తెలుగు360 రేటింగ్: 1.75/5
కొన్ని సినిమాలు హీరోల కోసం, ఇంకొన్ని సినిమాలు దర్శకుల కోసం వెళ్తాం. చాలా అరుదుగా మాత్రమే నిర్మాణ సంస్థని నమ్మి వెళ్తాం. అలాంటి బ్రాండ్ సంపాదించుకొంది ఎస్వీసీ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) సంస్థ. దిల్ రాజు జడ్జిమెంట్ పై నమ్మకం ఏర్పడి రెండు దశాబ్దాలు దాటింది. ఆయన కథని నమ్మే వ్యక్తి అని, సినిమాపై ఆయనకున్న ప్యాషన్ మరో నిర్మాతకు లేదని చెబుతుంటారు. అందుకే ‘ఇది దిల్ రాజు సినిమా’ అంటే నమ్మకాలు ఏర్పడిపోతాయి. అలాంటి నమ్మకం ‘తమ్ముడు’పైనా ఉంది. నితిన్, వేణు శ్రీరామ్ పేర్లు అదనపు అడ్వాంటేజ్‌లు మాత్రమే. నితిన్ మార్కెట్ కంటే, వేణు శ్రీరామ్ స్టాండర్డ్ కంటే ఎక్కువ బడ్జెట్ ఈ సినిమాకు పెట్టడంతో ఈ కథపై మరింత గురి కుదిరింది. మరింతకీ… ‘తమ్ముడు’ ఎలా ఉన్నాడు? దిల్ రాజు బ్రాండ్ వాల్యూ నిలబెట్టిందా? వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఈ సినిమాతో అయినా నిలదొక్కుకొన్నాడా?
జై (నితిన్) ఆర్చరీలో జాతీయ స్థాయి క్రీడాకారుడు. వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో దేశానికి బంగారు పతకం తీసుకురావాలన్నది అతని ధ్యేయం. అయితే.. మనసులో ఏదో స్ట్రగుల్ ఉంది. అది తగ్గితే కానీ ఆటపై గురి పెట్టలేవని కోచ్ సలహా ఇస్తాడు. దాంతో తనలో తాను పడుతున్న ఆ మానసిక సంఘర్షణ ఏమిటి అనేదానిపై దృష్టి పెడతాడు. ఆ సమయంలోనే చిన్నప్పుడు తనని వదిలి వెళ్లిపోయిన అక్క (లయ) గుర్తొస్తుంది. అక్కని కలుసుకొని, తనతో ‘తమ్ముడూ’ అని పిలిపించుకొంటే తప్ప, తన మానసిక వేదిన తగ్గదని జైకు అర్థం అవుతుంది. దాంతో అక్కని వెదుక్కొంటూ ప్రయాణం మొదలెడతాడు. కానీ అప్పటికే అక్క చిక్కుల్లో ఉంటుంది. తనని, తన కుటుంబాన్నీ ఓ గ్యాంగ్ వెంటాడుతుంటుంది. ఇంతకీ ఆ గ్యాంగ్ ఎవరు? అక్క సమస్య ఏమిటి? అందులోంచి తన అక్కని ఎలా బయటకు లాక్కొచ్చాడు? అనేది మిగిలిన కథ.
ఈ కథని రెండు ముక్కల్లో చెబితే – ఇందులో ఏముంది? ఇంత రొటీన్ కథని సినిమాగా ఎలా తీశారు? అనే ప్రశ్నలు మొదలవుతాయి. కొన్ని కథలు చెప్పుకోవడానికి రొటీన్ గా ఉన్నా, తెరపై కొత్తగా అనిపిస్తాయి. మన దురదృష్టం ఏమిటంటే.. వెండి తెరపై ఈ రొటీన్ కథ.. మరింత రొటీన్ సినిమాగా సాక్షాత్కరించడం. అసలు ఇంత సింపుల్ లైన్ ని నమ్మి, నిర్మాత దిల్ రాజు సినిమాగా తీయడానికి ఎలా ఒప్పుకొన్నాడు? అసలు ఏం చెప్పి దర్శకుడు దిల్ రాజు నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొన్నాడు? అనే వంద అనుమానాలు వేస్తాయి. ‘అనుగశ్చిత ప్రవాహః’ అనే ఓ సంస్క్రత వాక్యం అక్కడక్కడ హీరో వాడేస్తుంటాడు. అంటే ‘గో.. విత్ ద ఫ్లో’ అన్నమాట. ‘రాసుకొంటూ పోదాం.. ఏదో ఒకటి వస్తుంది కదా’ అని దర్శకుడు.. ‘తీసుకొంటూ పోదాం.. చివరికి హిట్టొస్తుందేమో’ అని నిర్మాత అనుకొని చేసుంటే తప్ప ఈ కథ స్క్రిప్టు దశని దాటుకొని సినిమాగా అవతరించదు.
ఓం ప్రధమంగా విలన్ ఎంట్రీతో కథ మొదలెట్టారు. విలన్ పాత్ర విచిత్రంగా ఉంటుంది. తన క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. విలన్ కి ఇచ్చే బిల్డప్పులు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ‘ఏదో బలమైన పాత్రే చూడబోతున్నాం’ అనిపిస్తుంది కూడా. కానీ క్రమక్రమంగా ఆ ఆసక్తి మందగిస్తూ ఉంటుంది. విలన్ అంతకు మించి ఏం చేయడు. తొలి పది నిమిషాల్లో విలన్ ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో చివరి వరకూ అదే చేస్తాడు. మధ్య మధ్యలో ఫోన్లో ‘నాకు అప్ డేట్ చేయ్’ అంటూ సహచరులకు చెబుతుంటాడు. అంతకు మించి ఏం చేయడు.
ఈ కథలోని గమ్మత్తు ఏమిటంటే హీరో ఎవరో విలన్‌కు తెలీదు. విలన్ ఎవరో హీరోకి తెలీదు. ఆఖరికి హీరోయిన్ ఎలా ఉంటుందో హీరోకి, హీరో ఎలా ఉంటాడో హీరోయిన్ కు చివరి వరకూ తెలీవు. ఇదే ఈ సినిమాలోని కొత్తదనం అని దర్శక నిర్మాతలు భావించి ఉంటే మనం చేసేదేం లేదు. హీరో తన అక్కని, అక్క కుటుంబాన్ని ఎలా కాపాడాడు? అందుకు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు? అనేది స్క్రీన్ ప్లే. సినిమా అంతా పరుగులే. కానీ… కథ అక్కడక్కడే కథాకళి చేస్తున్నట్టు ఉంటుంది. క్యారెక్టర్లు పరిగెట్టడం కాదు. సీన్లు పరిగెట్టాలి. కథ పరిగెట్టాలి.. అదే సినిమా. సినిమా అంటే అలానే తీయాలి. కానీ.. ఆ మ్యాజిక్ మిస్సయ్యింది.
జోనర్లో కూడా చాలా షిఫ్టింగులు ఉంటాయి. ముందు ఓ ఎమోషనల్ డ్రామాలా మొదలయ్యే కథ ఇది. ఆ తరవాత యాక్షన్ టింజ్లో కి వెళ్తుంది. ఛేజింగులు, క్రైమ్ డ్రామా.. ఇలా రకరకాలుగా రూపాంతరం చెందుతుంటుంది. అంబర గొడుగు అనే ఓ ఫాంటసీ ప్రాంతాన్ని క్రియేట్ చేశాడు దర్శకుడు. ఆ ఐడియా బాగుంది. కాకపోతే.. దాన్ని కూడా ఇంపాక్ట్ఫుల్ గా చూపించలేకపోయాడు. ఆ జాగ్రఫీని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు. స్క్రీన్ ప్లే పరంగా ఆసక్తి పెంచకపోతే రొటీన్ కథలు మరింత బలహీనంగా మారిపోతాయి అనడానికి ఈ సినిమా ఓ నిదర్శనం. సన్నివేశాల్ని ప్రేక్షకుడు ఫాలో అవ్వకపోతే, క్యారెక్టర్లపై సింపతీ రాకపోతే.. తెరపై ఎంత ఎమోషన్ జరుగుతున్నా రిజిస్టర్ కాదు. ‘తమ్ముడు’లోనూ అదే జరిగింది. సినిమాలో అరవై సన్నివేశాలు ఉన్నప్పుడు కనీసం ఆరైనా ‘భలే తీశాడు.. భలే ఆలోచించాడు’ అనిపించాలి. కానీ అర సీన్ కూడా అలాంటి అనుభూతి ఇవ్వలేదు. హీరోయిన్ (తనని అలా పిలవొచ్చా) ట్రాక్ కూడా శుద్ద దండగ. రేడియో జాకీని పోలిక క్యారెక్టర్ తనది. తన డైలాగ్ డెలివరీ, రైమింగులతో మాట్లాడే విధానం మరీ ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి.
అంబర గొడుగు అనే ప్రాంతం నుంచి హీరో తన కుటుంబాన్ని సురక్షితంగా తీసుకొచ్చిప్పుడే శుభం కార్డు పడిపోవాలి. కానీ అప్పుడు దర్శకుడికి జ్ఞాన బల్బ్ వెలిగి ఉంటుంది. ‘అరె.. ఇప్పటి వరకూ హీరోని విలన్, హీరోయిన్ హీరోని మీట్ కాలేదు.. ఇప్పుడెలా’ అనిపించి.. క్లైమాక్స్ తరవాత కూడా సినిమాని సాగదీశాడు. చివర్లో `న్యూ బిగినింగ్` అనే టైటిల్ కార్డ్ వేశాడు. అంటే ‘పార్ట్ 2’ ఉంటుందన్న మాట. సినిమా అంతా తట్టుకొన్న ప్రేక్షకుడు `పార్ట్ 2` అనేసరికి ఇంకాస్త కంగారుగా థియేటర్ల నుంచి బయటపడతాడు. ఈ సినిమాలో వేణు శ్రీరామ్ చేసిన మంచి పని ఏమైనా ఉందంటే.. లేడీ క్యారెక్టర్లని చాలా స్ట్రాంగ్ గా చూపించడం. వాళ్ల ధైర్యాన్ని పోట్రయిట్ చేయడం.
నితిన్ నటన ఈ సినిమాలో మరీ అంత ప్రత్యేకంగా ఏం లేదు. మిగిలిన సినిమాల్లో ఎలా కనిపిస్తాడో ఈ సినిమాలోనూ అలానే ఉన్నాడు. తన కథల ఎంపిక తన కెరీర్‌ని ప్రమాదంలో పడేస్తోంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. లయ చాలా కాలం తరవాత కనిపించారు. ఆమె నటన హుందాగా ఉంది. వర్ష బొల్లమ్మ ఓ చోట సర్ప్రైజ్ కి గురి చేస్తుంది. కాంతారా ఫేమ్ సప్తమి గౌడ కెరీర్‌కు ఏ కోణంలోనూ ఉపయోగపడని పాత్ర ఇది. సౌరబ్ సత్యదేవ్ క్యారెక్టరైజేషన్ తొలి సన్నివేశాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. చివరికి వచ్చేసరికి ఆ పాత్ర కూడా ఇంపాక్ట్ కి గురి చేయదు. మిగిలిన చాలా క్యారెక్టర్లు ఎలా ఉన్నా, అందులో నటించిన నటీనటులు రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది.
దిల్ రాజు బాగా ఖర్చు పెట్టారు. ఆ విషయంలో అనుమానం లేదు. కానీ కథపై ఆయన దృష్టి పెట్టలేదు. తన జడ్జిమెంట్ మరోసారి ఫెయిల్ అయ్యింది. ఓ రొటీన్ కథని జాగ్రఫికల్ గా కొత్తగా చూపిస్తే వర్కవుట్ అవ్వదన్న విషయాన్ని ఈ సినిమాతోనైనా ఆయన తెలుసుకోవాలి. విజువల్స్ బాగున్నా, క్లైమాక్స్ కు ముందొచ్చే వీఎఫ్ఎక్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. ‘మగధీర’ ఇంట్రవెల్ ని గుర్తు చేసే ఓ ఫైట్ డిజైన్ చేశారు. అక్కడ వీఎఫ్ఎక్స్ మరింతగా తేలిపోయాయి. పాటలకు స్కోప్ లేదు. ఆర్.ఆర్ లో మాత్రం పదును కనిపించింది. దర్శకుడిగా శ్రీరామ్ వేణు ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఆయన కథ, స్క్కీన్ ప్లే విషయాల్లో చాలా తప్పులు చేశారు. అందుకే తమ్ముడు అడుగడుగునా తడబడ్డాడు.
తెలుగు360 రేటింగ్: 1.75/5