తమిళనాడు టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విజయ్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. పొత్తులు ఉండవని.. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని విజయ్ కు సలహా ఇచ్చారు. కానీ అన్నా డీఎంకే బీజేపీతో పొత్తులు పెట్టుకుంది. ఆ టీంలో టీవీకే కూడా కలవాలన్న ఒత్తిడి వచ్చింది. దీనిపై విజయ్ ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయారు. బీజేపీతో కలిస్తే.. పార్టీ పెట్టిన పర్పస్ అంతా మట్టి కలిసిపోతుందని క్యాడర్ అభిప్రాయానికి రావడంతో ఒంటరి పోటీకి నిర్ణయం తీసుకున్నారు.
టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ విజయ్ ను అధికారికంగా ప్రకటించింది. విజయ్ పార్టీ పెట్టినప్పటి నుండి అన్నాడీఎంకే పొత్తు కోసం ఓ ద్వారం తెరిచి ఉంచాడు. పూర్తిగా అధికార డీఎంకే మీద ఎటాక్ చేస్తూ వచ్చారు కానీ.. అన్నా డీఎంకేను పల్లెత్తు మాట అనే వారు కాదు. అన్నాడీఎంకేకు గ్రామ గ్రామాన క్యాడర్ ఉండటం.. టీవీకే పార్టీ నిర్మాణం గ్రామ స్థాయికి వెళ్లాలంటే సమయం పడుతుంది కాబట్టి .. రెండు పార్టీలు కలిస్తే డీఎంకేను ఓడించవచ్చని అనుకున్నారు. అయితే బీజేపీ .. విజయ్ ప్లాన్లను భగ్నం చేసి.. అన్నాడీఎంకేను ఎన్డీఏను కలిపేసుకుంది.
ఇప్పుడు తమిళనాడులో ముక్కోణపు పోటీ తప్పదు. డీఎంకే నేతృత్వంలోని కూటమి బలంగా ఉంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి కూడా బలంగా పోరాడే అవకాశం ఉంది. మూడో ప్రత్యామ్నాయంగా టీవీకే పార్టీ ప్రజల ముందు ఉంది. మూడు పార్టీల పోరు మధ్య ఓట్లు చీలిపోయి అంతిమంగా డీఎంకే కూటమి లాభపడుతుందన్న అంచనాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.