స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్ కథలతో మెప్పించడం కష్టమే. ఈ తరహా కథల్లో పెద్ద మలుపులు, ఊహకు అందని సన్నివేశాలకు అవకాశం ఉండదు. అతి సాధారణమైన సంఘటనలు, నిజ జీవితాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు, అందరూ రిలేట్ చేసుకునే పాత్రలతో కథను నడపాలి. ట్రైలర్లోనే కంటెంట్ చూపించేయాలి. సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 3 బీహెచ్‌కే జానర్ కూడా ఇదే. ట్రైలర్లోనే దాదాపు కథని చెప్పేశారు. మరి అందరూ రిలేట్ చేసుకునే ‘సొంతిల్లు’ కల చుట్టూ తిరిగిన ఈ సినిమా ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? ఈ మధ్యతరగతి కుటుంబ ప్రయాణంలో మనసుకు హత్తుకునే మూమెంట్స్ ఏమిటి?
వాసుదేవ్ (శరత్ కుమార్) ఓ మిడిల్ క్లాస్ ఫాదర్. భార్య శాంతి (దేవయాని). కొడుకు ప్రభు (సిద్ధార్థ్), కూతురు ఆర్తి (మీతా రఘునాథ్). వాసుదేవ్ ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. ఎప్పటికైనా 3 బీహెచ్‌కే ఇల్లు కొనుక్కోవాలనేది అతడి కల. కొంచెం కొంచెం డబ్బు కూడబెట్టి, ఓ ఇంటికి అడ్వాన్స్ ఇస్తాడు. సరిగ్గా ఇదే సమయానికి కొడుకు ప్రభు కాలేజ్ సీట్ కోసం డబ్బులు కట్టాల్సి వస్తుంది. అలా ఇంటి కల వాయిదా పడుతుంది. అయితే ప్రభు బాగా చదివి ఉద్యోగం చేసి తన కలని తీరుస్తాడని ఆశపడతాడు వాసుదేవ్. మరి ప్రభు ఆ కల తీర్చాడా? అతడి చదువు ఎలా సాగింది? ఉద్యోగం వచ్చిందా? సొంతింటి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది తక్కిన కథ.
మధ్య తరగతి జీవితం చుట్టూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ జీవితాల్లోని ప్రతి అంకాన్ని లోతుగా పరిశీలిస్తే ప్రతీ దశలోనూ ఓ కథ కనిపిస్తుంది. సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి కల. ఈ కలని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఈ కథలో ప్రత్యేకత ఏమిటంటే… మధ్యతరగతి సమాజాన్ని రెండు దశాబ్దాల కాలం పాటు చిత్రీకరించాడు. ప్రతి పాత్ర ప్రయాణాన్ని దాదాపు 20 ఏళ్లకు పైగా చూపించాడు. స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్ పై ఆసక్తి లేని ఆడియన్స్‌కు ఈ ప్రయాణం పరమ ల్యాగ్ అనిపించే ఛాన్స్ ఉంది. కానీ ఫీల్ గుడ్ సినిమాలని ఆస్వాదించే ప్రేక్షకులు మాత్రం ఆ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అవుతారు.
కథ నేరుగా సొంతిల్లు కల పాయింట్లోనే ఓపెన్ అవుతుంది. కానీ మధ్యతరగతి వ్యక్తి కల తీరడం అంత ఈజీ కాదు. మిడిల్ క్లాస్ కష్టాలు సుఖాలు రాత్రి పగలు లాంటివి. కాస్త డబ్బు సమకూరిందని సంబరపడేలోగే కొడుకు కాలేజ్ ఫీజు నెత్తిన పడుతుంది. అది తీరిందంటే ఆ లోపలే అనారోగ్యం చేస్తుంది. అది కుదుటపడి, కొడుకు ఉద్యోగంలో చేరాడనే సంతోషం… కూతురు పెళ్లి ఖర్చుతో మాయమైపోతుంది. ఇక కొడుకు పెళ్లి. అంతా బావుందనే సమయానికి ఇష్టంలేని ఉద్యోగం చేస్తున్న కొడుకు… ప్రతిరోజూ ఓ నరకం అనుభవిస్తుంటాడు. ఉద్యోగం చేయాలా? మనశాంతిగా ఉండాలా? అనే డైలెమా. ఈ లోగా అత్తింటి వేదింపులు తట్టుకోలేక కూతురు ఇంటికి చేరుతుంది. రెగ్యులర్ లైఫ్‌లో కనిపించే ఈ సంఘటనలన్నీ 3 బీహెచ్‌కేలో ఉన్నాయి. అయితే దర్శకుడు వాటిని ట్రీట్ చేసిన విధానం బావుంది. కష్టాన్ని కష్టంలా కాకుండా మైల్డ్ మెలొడ్రామాతో నడిపిన తీరు నచ్చుతుంది.
కుటుంబ కలని మోసే ప్రభు పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. ఇంటర్ కాలేజ్ డేస్ నుంచి ప్రభు పాత్రని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. 46 ఏళ్ల సిద్దు ఇంటర్ కాలేజ్ కుర్రాడిగా కనిపించినా అంత ఎబ్బెట్టుగా అనిపించలేదు. తన ఫిజిక్ బాగా సహకరించింది. ఎమోషనల్‌గా ఆ క్యారెక్టర్‌తో కనెక్ట్ అవుతాం. నిజానికి చాలా మంది మధ్యతరగతి కుర్రాళ్లను రిప్రజెంట్ చేశాడు. ఇంట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకొని కొంతమంది లక్షలు చెల్లించే చదువు వద్దనుకుంటారు. కానీ పేరెంట్స్ బలవంతం పెట్టి తనకి ఇష్టం లేని కోర్సులో జాయిన్ చేయించి ఒత్తిడి ఇంకా పెంచేస్తారు. ఆ ఒత్తిడి మోస్తూ బతకడం ఎంత కష్టమో ప్రభు పాత్ర తెరపై ఆవిష్కరిస్తుంది.
వాసుదేవ్ పాత్రలో శరత్ కుమార్ హుందాగా కనిపించాడు. చాలా కూల్ ఫాదర్. పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేసే సగటు తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. దేవయాని పాత్ర కూడా హత్తుకుంటుంది. ఆర్తి పాత్రలో మీతా రఘునాథ్ నటన చాలా సహజంగా ఉంది. మగ పిల్లాడి చదువు కోసం ఇంట్లో ఆడపిల్ల ఎలాంటి త్యాగం చేస్తుందో చాలా లైటర్ వెయిన్‌లో చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత ఆర్తి వైవాహిక జీవితంలో వచ్చే స్పర్ధను కూడా అంతే ఎఫెక్టివ్‌గా చూపించాడు. ఇందులో బయటికి కనిపించని ఓ ప్రేమకథ ఉంది. ఐశ్వర్య పాత్రని చేసిన చైత్ర కథకు మంచి ఎమోషన్‌ను యాడ్ చేసింది. ప్రభు–ఐశ్వర్య ట్రాక్ చాలా పరిణితితో రాశాడు దర్శకుడు. యోగిబాబుది గెస్ట్ రోల్. మిగతా పాత్రలు రిలేట్ చేసుకునేలానే ఉంటాయి.
ఈ కథకు కావాల్సిన ప్రతి టెక్నీషియన్‌ను యాప్ట్‌గా ఎంచుకున్నాడు దర్శకుడు శ్రీగణేష్. కెమెరావర్క్, నేపధ్య సంగీతం, ఆర్ట్ వర్క్ అన్నీ విభాగాల్లో మంచి పనితీరు కనిపించింది. ఇలాంటి కథలు నింపాదిగానే సాగుతాయి. ఈ విషయంలో ఎడిటర్ని తప్పుపట్టడానికి లేదు. తెలుగు మాటలు కూడా బావున్నాయి.
ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించి కిర్రెక్కించే సినిమా కాదిది. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడాలంటే కంటెంట్‌లో ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి. అలాంటిదేదో ఆశించి సినిమాకి వెళ్తే నిరాశపడతారు. ట్రైలర్ నచ్చి, రిలేట్ చేసుకునే ఎమోషన్స్ ఉంటే చాలనుకునే ఆడియన్స్‌కి మాత్రం 3 బీహెచ్‌కే మెప్పిస్తుంది.