కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్నారు. ఓ రోజు సాయంత్రం హోటల్లో..మరో రోజు గాంధీభవన్ లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో ఆయన కట్టుతప్పుతున్న నేతలను హెచ్చరించడానికే సరిపోయింది కానీ పాలన మెరుగుపర్చుకోవాలని ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. పార్టీ నేతలు పూర్తిగా క్రమశిక్షణ దాటిపోతున్నారని.. గ్రూపులుగా సమావేశాలు పెడుతున్నారని ఆయనకు నివేదికలు అందడంతో హెచ్చరికలు జారీ చేశారు.
గ్రూపులుగా సమావేశాలు పెడితే భయపడతామని అనుకోవద్దని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ఆయన గతంలో గ్రూపులు కట్టారు.తాజాగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో మల్లి ఖార్జున్ ఖర్గే.. ఆయనకు వార్నింగులు సరిపోవని.. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని హెచ్చరించారు. అలాగే కొండా దంపతులను ఉద్దేశించి కూడా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. పలువురు నేతలు మంత్రుల తీరుపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు మీనాక్షి నటరాజన్ ఫోటో లేకుండా పీసీసీ తరపున ప్రకటనలు ఇచ్చారని.. మంత్రి పొంగులేటిపై కొంత మంది ఫిర్యాదు చేశారు. ఇంచార్జ్ అవమానించారని అంటున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడి రాకతో.. ఫిర్యాదుల పరంపర నడిచింది. ఆయన కూడా కొంత మందికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి హెచ్చరికలకు లొంగేవారు కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ అనిరుథ్ రెడ్డికి నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సంకేతాలు ఇస్తే మాత్రం.. కొంత అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.