అనుష్క చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా ‘ఘాటీ’. క్రిష్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈనెల 11న విడుదల కావాలి. కానీ.. వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘ఘాటీ’ ప్రమోషన్లు మొదలు పెట్టలేదు కాబట్టి, ఈ వాయిదా వల్ల పెద్దగా ఇబ్బంది పడేదేం లేదు. కాకపోతే నెక్ట్స్ రిలీజ్ డేట్ ఎప్పుడదన్నది మాత్రం కాస్త సస్పెన్స్ లో పడింది.
వీఎఫ్ఎక్స్ పనులు మరో మూడు నుంచి నాలుగు వారాల్లో పూర్తవుతాయని సమాచారం. అంటే.. కనీసం వచ్చే నెలలో అయినా విడుదలకు రెడీ అవ్వాలి. కానీ `ఘాటీ` అప్పటికి రావడం అనుమానమే అని తెలుస్తోంది. ఎందుకంటే… సినిమా రెడీ అయినా, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం, అధికారం నిర్మాత చేతుల్లో లేకుండా పోయింది. ఈ సినిమాని అమేజాన్ ప్రైమ్ కి ఎప్పుడో ఇచ్చేశారు. వాళ్లు ఫిక్స్ చేసిన రిలీజ్ డేట్ కే ‘ఘాటీ’ విడుదల అవ్వాలి. జులై 11న అమేజాన్ డెడ్ లైన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ డేట్ మిస్సయ్యింది. కాబట్టి ఈలోగా ‘ఘాటీ’ విడుదల చేయడం కష్టం. అమేజాన్ షెడ్యూల్ ఆల్రెడీ ఫిక్సయ్యింది. ఏ సినిమా ఎప్పుడు రావాలన్న విషయంలో వాళ్లు క్లియర్ కట్ గా ఉంటారు. ‘ఘాటీ’ స్లాట్ మరో సినిమాకి ఇవ్వలేరు. అలాగని మరో సినిమా స్లాట్ ఘాటీకి షిఫ్ట్ చేయలేరు. సెప్టెంబరు వరకూ ఘాటీ విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది. అమేజాన్ షెడ్యూల్ అప్పటి వరకూ ఫిక్సయ్యిందని, ఆ తరవాతే ఘాటీని రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సో.. వీఎఫ్ఎక్స్ పనులు సిద్ధమైనా ఘాటీ ఈలోగా విడుదల కాకపోవొచ్చు.