అమరావతిలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టనుంది. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం లో సీబీఐ కార్యాలయానికి భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐతో పాటు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడెమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. వీరు అందరూ ఆరు నెలల్లో నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది.
మరో వైపు రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4 , తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదించింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్, స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ , మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ ఎఫ్ పీ పిలవాలని నిర్ణయించారు. ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్లను నిర్మించనున్నారు. మందడం, తూళ్లురు, లింగాయపాలెంలో 2.5 ఎకరాల చొప్పున నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదంమ తెలిపారు. రాజధానిలోని ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.
పొట్టి శ్రీరాములు , అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటు స్థలం కేటాయించేందుకూ అథారిటీ ఆమోదం తెలిపింది. వచ్చే రెండేళ్లలో నిర్మాణాల కోసం పెద్ద ఎత్తున అసుక అవసరం . అందుకే డ్రెడ్జింగ్కకు ఆమోదం తెలిపారు. అమరావతిలో ఇప్పటికే టెండర్లు అప్పగించిన పనులను ఆయా సంస్థలు జోరుగా చేపట్టాయి. ఎక్కడ చూసినా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రైవేటు సంస్థల నిర్మాణాలు ప్రారంభమయ్యాక.. మరో పది వేల మంది పనులు చేస్తూ ఉంటారు.