వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లును చట్టంగా చేస్తే తాను కొత్త పార్టీ పెడతానని ఎలాన్ మస్క్ ఇది వరకు ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందడంతో ఆయన తాను చెప్పిన ప్రకారం అమెరికా పార్టీని పెడుతున్నట్లుగా ట్వీట్ చేశారు. అయితే ఆయన సీరియస్ గా ఈ పార్టీ ప్రకటన చేశారా లేకపోతే.. ట్రంప్ మనస్థత్వం తెలుసు కాబట్టి బెదిరించేందుకు చేస్తున్నారా అన్నది సస్పెన్స్ గానే ఉంది.
అమెరికా పార్టీని ఏర్పాటు చేయడానికి 2:1 నిష్పత్తిలో తన ఫాలోవర్స్ సమర్థించారని మస్క్ చెప్పుకున్నారు. తన ప్రణాళికల్ని కూడా వివరించాడు. నేరుగా అధ్యక్ష పీఠానికి గురిపెట్టే చాన్స్ లేదు కాబట్టి..కింగ్ మేకర్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. రెండు లేదా మూడు సెనేట్ సీట్లు , 8-10 హౌస్ డిస్ట్రిక్ట్‌లపై దృష్టి సారిస్తే చాలని.. రిపబ్లికన్లు, డెమెక్రాట్లను గుప్పిట్లో పెట్టుకోవచ్చని అనుకుంటున్నాడు. తాము ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ పవర్ లో ఉండేలా చూడగలమని అనుకుంటున్నాడు.
అయితే మస్క్ లో నిజంగా సీరియస్ నెస్ ఉందా లేదా అన్న దానిపై చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఈ ప్రకటనను ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చేందుకు లేదా రాజకీయంగా చర్చల్లో ఉండేందుకు ఉపయోగించుకుంటున్నారని అనుమానిస్తున్నారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీల ఆధిపత్యాన్ని ఛేదించడం దాదాపుగా అసాధ్యం. గతంలో మూడవ పార్టీలను ప్రారంభించినప్పటికీ అవి ప్రభావం చూపలేకపోయాయి. కానీ అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థపై అసంతృప్తి పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. 2023లో 63శాతం మంది ఓటర్లు మూడవ పార్టీ అవసరమని గాలప్ సర్వేలో చెప్పారు.
అమెరికా రాజకీయ వ్యవస్థలోని ఎలక్టోరల్ కాలేజ్, ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్, బ్యాలెట్ యాక్సెస్ చట్టాలు కొత్త పార్టీలకు పెను సవాళ్లుగాఉంటాయి. మస్క్ వద్ద సంపదకు కొదవలేదు. పార్టీని నడపడానికి డబ్బు సమస్య ఉండదు. కానీ నిబంధనల ప్రకారం సొంత డబ్బుతో పార్టీ నడపలేరు. ఎలాన్ మస్క్ తన పార్టీ నమోదు ప్రక్రియ నుంచి సీరియస్ నెస్ చూపిస్తే.. రాజకీయంగా ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది.