తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇది పూర్తిగా అధికారిక పర్యటన. కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు ఆయన వెళ్లారు. హైకమాండ్ పెద్దలతో ఎలాంటి సమావేశాలు లేవు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు.. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో ఫలితాలు చూపించాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. నిధుల అవసరం వెంటాడుతోంది. అందుకే ఆయన.. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కారణంగా తమ రాష్ట్రంపై వివక్ష చూపించకుండా ఉండేందుకు.. కేంద్ర మంత్రులకు.. రాజకీయం వేరు.. పాలన వేరు అని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
హోంమంత్రి అమిత్ షాతోనూ రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. దీని వల్ల ఇతర మంత్రులు కూడా పాలనా విషయాల్లో తెలంగాణకు ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపించాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి ఇలా కేంద్ర మంత్రులతో భేటీ అయితే..కాంగ్రెస్ హైకమాండ్ కూడా సందేహించే అవకాశం ఉంది. అయినా రేవంత్ రెడ్డి మాత్రం.. కాంగ్రెస్ పార్టీ విషయంలో తన నిబద్ధతను అనుమానించాల్సిన అవసరం ఉండదని గట్టిగా నమ్ముతున్నారు. పాలన విషయాల్లో.. కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తున్నారు.
రేవంత్ తీరుతో చాలా మంది ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. రేవంత్ బీజేపీకి దగ్గరవుతున్నారని చెబుతూ వస్తున్నారు. కానీ రాజకీయం వేరు.. పాలన. వేరు అని రేవంత్ అంటున్నారు. రాజకీయం కోసం పాలనా విషయాల్లోనూ ఈగోకు పోతే తెలంగాణకు నష్టం జరుగుతుందని నమ్ముతున్నారు. అందుకే ఎవరేమనుకున్నా… రేవంత్ తన పద్దతిలో తాను వెళ్తున్నారు.