కేటీఆర్ సిరిసిల్ల ప్రజలకు తాయిలాలు పంచాలని డిసైడయ్యారు. అందుకు తన పుట్టినరోజును ముహుర్తంగా ఎంచుకున్నారు తన జన్మదినం సందర్భంగా ఈ నెల 24న సిరిసిల్ల జిల్లాలోని బాలింతలు, శిశువులకు కేసీఆర్ కిట్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. 18 నెలలుగా పుట్టిన ప్రతి ఒక్క తల్లికి, శిశువుకు కేసీఆర్ కిట్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఎంత మంది ఉంటారో లెక్క తేల్చారు. 4910 మంది మాతృమూర్తులు, వారి శిశువులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో దానాలు చేయమని ప్రోత్సహించేవారు. వికలాంగులకు బండ్లు, ఉపాధి కార్యక్రమాలు కల్పించేలా నాయకుల్ని ప్రోత్సహించేవారు. కేటీఆర్ వద్ద ప్రాపకం కోసం చాలా మంది ఆయన పుట్టినరోజు నాడు దానాలు చేసేవారు. కేటీఆర్ కూడా కొంత మందికి సాయం చేసేవారు. ఈ సారి సిరిసిల్ల ప్రజలకు గిఫ్టులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
కేసీఆర్ హయాంలో కేసీఆర్ కిట్ పథకం అమల్లో ఉండేది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే కిట్లు ఇవ్వడం మానేశారు. అయితే అధికారికంగా పథకం ఆపేయలేదు. ఈ రపథకం తనకు చాలా ఇష్టమని కేటీఆర్ అంటున్నారు. కేసీఆర్ కిట్‌ను ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని అందుకే సిరిసిల్ల జిల్లాలో గత 18 నెలలుగా పుట్టిన ప్రతి ఒక్క శిశువుకు కేసీఆర్ కిట్ ను అందిస్తానని ప్రకటించారు.
అధికారం పోయిన తర్వాత సిరిసిల్లలో సమస్యలను పరిష్కరించడంలో కేటీఆర్ ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వచ్చింది.