కేటీఆర్ తనకు తాను ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సవాల్ చేశారు. తమ పార్టీ నేతలతో ప్రెస్ క్లబ్ బుక్ చేసుకున్నారు. ఓ కుర్చీకి సీఎం రేవంత్ రెడ్డికి రిజర్వ్ చేసినట్లుగా స్టిక్కర్ పెట్టారు. మరో కుర్చిలో తాను కూర్చున్నారు. సీఎం రాలేదని చెప్పి.. చర్చలకు దమ్ము లేని రేవంత్ ఇంకెప్పుడూ సవాళ్లు చేయవద్దని తేల్చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడైనా రేవంత్ ను ఇన్వాల్వ్ చేయలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా మేము వస్తామని చెప్పలేదు. సరే కేటీఆర్ అంటున్నారు కాబట్టి వస్తామని చెప్పినా కేటీఆర్ కు రేవంత్ మాత్రమే రావాలి. చివరికి ఇదో స్టేజ్ డ్రామాలాగా ముగిసిపోయింది. రేవంత్ భయపడ్డాడని రాలేదని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. మొత్తం వన్ సైడ్ వ్యవహారంలా ఈ ఎపిసోడ్ జరిపేసుకున్నారు.
బరిలో తలపడాలి కానీ !
ఎవరైనా కుస్తీ పోటీలు ఏర్పాటు చేసుకుంటే.. దానికి తగ్గ గ్రౌండ్ ను రెడీ చేసుకుంటారు. అంతే కానీ.. ఓ ఆటగాడు గ్రౌండ్ ను తానే ప్రిపేర్ చేసుకుని.. తానే మనుషుల్ని పెట్టుకుని..తన ప్రత్యర్థి కోసం ఎదురు చూసి.. రాలేదని విజేతగా ప్రకటించుకుంటే కామెడీగా ఉంటుంది. కేటీఆర్ చర్చా కార్యక్రమం సవాళ్లు అలాగే ఉన్నాయి కానీ.. ఏ మాత్రం కన్విన్సింగ్ గా లేవు. కేటీఆర్.. రేవంత్ విసిరిన సవాల్ కు సమాధానం చెప్పాలి. అంగీకారంతో చర్చా కార్యక్రమం నిర్వహించాలి. అంతే కానీ ఏకపక్షంగా ఓ కార్యక్రమం నిర్వహించేసి. చర్చకు దమ్ము లేదంటే ఎట్లా ?
ఎక్కడికైనా వస్తారు.. అసెంబ్లీకి మాత్రం రారా ?
ప్రతిపక్షం అంటే ఏదైనా సమస్య వస్తే అసెంబ్లీని పెట్టాలని డిమాండ్ చేయాలి. కానీ కేటీఆర్.. ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తాం.. చివరికి జూబ్లిహిల్స్ ప్యాలెస్ కు అయినా వస్తాం..చర్చకు రెడీ అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన అధికారిక నివాసం కోసం.. ప్రగతి భవన్ లు నిర్మించుకోలేదు. తన వ్యక్తిగత నివాసాన్నే ఉపయోగించుకుంటున్నారు. అది ప్యాలెస్ లా కేటీఆర్ చెబుతున్నారు. ఆ సవాళ్లలో.. అసెంబ్లీని మాత్రం చేర్చడం లేదు. అసెంబ్లీలో చర్చకు పెడతాం.. ప్రతిపక్ష నేత రావాలని అంటే మాత్రం కేటీఆర్ నోటి వెంట మాట రావడం లేదు. ఎక్కడికైనా వస్తాం కానీ.. అసెంబ్లీకి మాత్రం రానని అంటున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిందే స్థాయి..కేటీఆర్ ఊహించుకున్నది కాదు !
మాట్లాడిదే.. రేవంత్ రెడ్డికి కేసీఆర్ స్థాయి లేదని అందుకే ఆయన రారని.. ఆయనకు తానే ఎక్కువ అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిందే స్థాయి. కేసీఆర్ కు పదేళ్ల పాటు సీఎం స్థాయి ఇచ్చారు. ఇప్పుడు ఆ పొజిషన్ రేవంత్ రెడ్డికి ఇచ్చారు. కేసీఆర్కు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతల ప్రకారం నిర్వర్తించాలి కానీ.. తాము కొండ మీద ఉన్నామని.. మా స్థాయి వేరు అని అనుకుంటే.. ఎలా ?. కేటీఆర్ అదే అనుకుంటున్నారు. ఒక వేల కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఆ ప్రతిపక్ష స్థానాన్ని కేటీఆర్ తీసుకుంటే..అప్పుడు.. రేవంత్ ను సవాల్ చేసేందుకు సరైన పొజిషన్ కు వచ్చినట్లుగా అనుకోవచ్చు.అంతే కాదు.. సీఎం స్థాయిని గుర్తించబోమంటూ అహంకార రాజకీయాలు చేయడం .. ప్రజాస్వామ్యానికి అవమానమే.