దుబాయ్ లో పనులు చేసుకోవడానికి వెళ్లే వారు ఎక్కువగా ఉంటారు. ఏపీ, తెలంగాణతో పాటు కేరళ నుంచి వెళ్లేవారు లెక్కలేనంత మంది. అలా వెళ్లి అక్కడే వ్యాపారాలు చేసి కుబేరులు అయిన వారి నుంచి కథలు కథలుగా ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ రూట్ మార్చింది. పనుల కోసం వచ్చే వారే కాదు.. వారికి పనులు కల్పించే వారినీ ఆకర్షించేందుకు ప్రణాళిక వేసింది. అందుకే గోల్డెన్ వీసా అనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
దుబాయ్ గోల్డెన్ వీసా అనేది UAE ప్రభుత్వం అందించే దీర్ఘకాలిక రెసిడెన్సీ ప్రోగ్రామ్, ఇది పెట్టుబడిదారులు, స్టార్టప్‌లు , స్కిల్డ్ లేబర్ వంటి వారికి స్పాన్సర్ లేకుండా దుబాయ్‌లో నివసించడానికి, పని చేయడానికి లేదా చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. నామినేషన్-ఆధారిత గోల్డెన్ వీసా ద్వారా, భారతీయులు AED 100,000 అంటే దాదాపుగా 24 లక్షలు ఒకేసారి చెల్లించి జీవితకాల రెసిడెన్సీ వీసా పొందవచ్చు.
ఇప్పటి వరకూ కనీసం ఐదు కోట్ల రూపాయలు దుబాయ్ లో పెట్టుబడి పెడితేనే గోల్డెన్ వీసా వస్తుంది. దుబాయ్ దీన్ని పూర్తిగా మార్చేయడానికి కారణం ఉంది. ఆయిల్ పై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో మార్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆయిల్ పై వస్తున్న ఆదాయంతో .. ఇతర రంగాలను అభివృద్ధిచేస్తోంది. విజ్ఞానం, విద్య, డిజిటల్ మీడియా, ఆరోగ్యం, ఆర్థికం, స్టార్టప్‌లు, ఈ-స్పోర్ట్స్, షిప్పింగ్ రంగాలలో అగ్రదేశంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.
దుబాయ్‌లో ఉండే మరో ప్లస్ పాయింట్ ఏమిటంేట దుబాయ్‌లో వ్యక్తిగత ఆదాయం మీద పన్ను లేదు. అక్కడ ఉండే ఒకే ఒక్క పన్ను ఐదు శాతం వ్యాట్. అదే సమయంలో దుబాయ్ వ్యాపార కేంద్రంగా, ఆర్థిక రాజధానిగా మారుతోంది. స్టార్టప్‌లు , పెట్టుబడులకు అనుకూలం. అందుకే భారతీయ ధనవంతులలో ఎక్కువ మంది దుబాయ్ గోల్డెన్ వీసా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్గెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.