హైడ్రాను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో కానీ.. ఆ పనులు మాత్రం చాలా పరిమితంగా చేస్తుందని రియల్ ఎస్టేట్ పంచాయతీలు ఎక్కువగా చేస్తుందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. రాజకీయ పార్టీల మాదిరిగా.. హైడ్రాకు ప్రశంసలు అని మీడియాలో ప్రచారం చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. కానీ కొన్ని కొన్ని చర్యలు మాత్రం వివాదాస్పదం అవుతోంది. తాజాగా ప్రణీత్ ఆంటిల్యా అనే గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చివేయడం వివాదాస్పదమవుతోంది.
బాచుపల్లి రెవెన్యూ విలేజ్ మ్యాప్ ప్రకారం ప్రణీత్ ఆంటీలియా బిల్డర్ అడ్డుగోడ కట్టారంటూ కొందరు స్థానిక రాజకీయ నాయకులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల సహకారంతో ఇటీవల యాంటిలీయా సరిహద్దు గోడను నేలమట్టం చేయించారు. హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో.. స్థలం కొనుగోలు చేసి బిల్డర్లు ఆ గేటెడ్ కమ్యూనిటీ నిర్మించారు. పన్నెండేళ్ల నుంచి ఆరు వందల యాభై కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రణవ్ యాంటిలీయా ప్రాజెక్టులో.. ఒకే ఒక్క అరవై ఫీట్ల రోడ్ ఉంది. మిగతా ముప్పయ్ అడుగుల రోడ్లే ఉన్నాయని కమ్యూనిటీ వాసులు చెబుతున్నారు. తమ విల్లా కమ్యూనిటీ చెరువులో లేదు.. బఫర్ జోన్లో కూడా లేదు.. ఎవరో వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని అందిస్తే.. అది నిజమేనని నమ్మి.. తమ కమ్యూనిటీ సరిహద్దు గోడను కూల్చడమేమిటని స్థానిక ప్రజలు హైడ్రాను ప్రశ్నిస్తున్నారు.
దీనిపై హైడ్రా సుదీర్ఘమైన వివరణ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మల్లంపేట ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్స్ మీదుగా ప్రగతినగర్ కు కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సరిపోతోంది. కాని దారి మధ్యలో ప్రణీత్ ఆంటిల్యా వారు నిర్మించిన అడ్డుగోడతో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని మల్లంపేట గ్రామప్రజలతో పాటు.. మరో 10 కాలనీల వాసులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పింది. అంతే కాదు అది గేటెడ్ కమ్యూనిటీ కాదని హైడ్రామా చెబుతోంది. హెచ్ ఎం డీఏ అనుమతిచ్చిన లే ఔట్ లో గేటెడ్ కమ్యూనిటీ కాదని ఉందని పక్కన ఉన్న కాలనీవాసులకు దారి చూపాలని ఎంతో స్పష్టంగా పేర్కొందని చెబుతున్నారు. ఆ క్రమంలోనే అక్కడి ప్రహరీలను హైడ్రా ఇటీవల తొలగించిందన్నారు.
అయితే అసలు సమస్య పరిష్కారం కోసం నిజాంపేట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం.. మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4ఏ నుంచి రెడ్డీ ల్యాబ్స్ మీదుగా ఓల్డ్ ముంబై దర్గా వరకూ వంద అడుగుల రోడ్డును అభివృద్ధి చేస్తే సరిపోతుదంని అక్కడి ప్రజలు చెబుతున్నారు. శాశ్వత పరిష్కారాన్ని వదిలేసి చిన్న చిన్న కాలనీలను టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పన్నెండేళ్లుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీని .. గేటెడ్ కమ్యూనిటీ కాదని చెప్పడం.. బళ్ల బాట ఉందని కొత్తగా వాదన తీసుకు రావడంతో హైడ్రా పై న్యాయపోరాటానికి ప్రణీత్ అంటీలియా వాళ్లు సిద్ధమవుతున్నారు.