గుజరాత్‌లోని వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. అత్యంత బిజీగా ఉండే వంతెన కావడంతో. కూలిపోయే సమయంలో వంతెనపై ఉన్న కార్లు, ట్రక్కులు, బస్సులు, బైకులు నదిలో పడిపోయాయి. ఈ కారణంగా పది మంది చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. ఈ వంతెన సెంట్రల్ గుజరాత్‌ను సౌరాష్ట్రతో కలిపే కీలకమైన పాద్రా-ముజ్పూర్ రహదారిపై ఉంది.
గంభీర బ్రిడ్జి సుమారు 40 ఏళ్ల పాతది. ఇది ప్రమాదకరంగా మారుతోందని అనేక సార్లు నివేదికలు అందినా గుజరాత్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ వంతెన సౌరాష్ట్ర ట్రాఫిక్‌కు కీలకం. ఈ వంతెన పాతబడిపోయిందని.. కొత్తది నిర్మించాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నప్పటికీ గుజరాత్ ప్రభుత్వం పట్టించుకోలేదు. భారీ వాహనాలు కూడా ఈ వంతెన మీద నువ్ వెళ్తూంటాయి. దశాబ్దాలుగా గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇటీవలి కాలంలో పలు విషాదాలు గుజరాత్ లో చోటుచేసుకుంటున్నాయి.
2022 మోర్బీ బ్రిడ్జి నిర్మాణ లోపాలు, అధిక లోడ్ కారణంగా కూలిపోయింది. అది 100 ఏళ్ల పాత సస్పెన్షన్ బ్రిడ్జి. 135 మంది మరణించారు. ఆనంద్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక నిర్మాణం 2024 నవంబర్ 5న కూలిపోయి, ముగ్గురు కార్మికులు మరణించారు. ఈ ప్రమాదాలు గుజరాత్ అభివృద్ధి నమూనాను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎపుడో దశాబ్దాల కిందట కట్టిన ఇన్ ఫ్రా తప్ప.. గుజరాత్ లో కొత్త ఏమీ నిర్మించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.