విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు ఏపీ బీజేపీ నేతలకు నచ్చలేదు. అసలు లెనిన్ ఎవరు.. మన దేశంతో ఏం సంబంధం.. ఆయన విగ్రహం విజయవాడలో ఎందుకు ఉంది. లెనిన్ సెంటర్ అని ఎందుకు పిలవాలని ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడికి డౌట్ వచ్చింది. అందుకే బాధ్యతలు స్వీకరించడానికి వెళ్లే దారిలోనే ఉన్న లెనిన్ సెంటర్ లోనే ఉన్న విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి దండలేసి.. ఆ సెంటర్ కు విశ్వనాథ వారి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
గతంలో గుంటూరులో ఉన్న జిన్నాటవర్ సెంటర్ మీద ఇలాగే రెచ్చిపోయారు. జిన్నా టవర్ పేరు మార్చాలని ఆందోళనలు చేశారు. కొన్నాళ్ల తర్వాత వేరే పని మీద బిజీ కావడంతో ఆ విషయం మర్చిపోయారు. ఇప్పుడు విజయవాడలో బీజేపీ ఆపీసుకు వెళ్లే దారిలో ఉందని లెనిన్ సెంటర్ పేరును అందుకున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు విజయవాడలో బలంగా ఉండేవారు. నలభై ఏళ్ల కిందట.. అప్పటి సీపీఐ నాయకులు యూఎస్ఎస్ఆర్ నుంచి ఓ విగ్రహం తెప్పించి.. విజయవాడలో స్థాపించారు. ఆ ప్రాంతాన్ని మెల్లగా లెనిన్ సెంటర్ అని పిలవడం ప్రారంభించారు. అంతే కానీ ఎవరూ పేరు పెట్టలేరు.
ఇప్పుడు లెనిన్ సెంటర్ అంటే.. ఓ బెంచ్ మార్క్ అడ్రస్ గా మారింది. అది బుక్ షాపుల కేంద్రం. వాణిజ్య కేంద్రం. ఇప్పుడు ధర్నా చౌక్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఇలాంటి సెంటర్ పేరును విశ్వనాథ సత్యనారాయణ సెంటర్ గా మార్చాలని మాధవ్ డిమాండ్ చేస్తున్నారు. ఉంది కూటమి ప్రభుత్వమే కాబట్టి.. ఆయన ఉత్తర్వులు తెప్పించుకోవచ్చు. కానీ.. ప్రజలు దశాబ్దాలుగా లెనిన్ సెంటర్ అనే పిలుచుకుంటున్నారు. వారు మానేస్తారా అన్నదే సమస్య.