C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి వినూత్న చిత్రాలని నిర్మించారు ప్రవీణ పరుచూరి. నటిగా కూడా ఆకట్టుకున్నారు. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ఇదొక గ్రామీణ కథ. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
రామకృష్ణ ఓ లోకల్ రికార్డింగ్ డ్యాన్సర్. సావిత్రి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒక రోజు సావిత్రి అతన్ని గడ్డివాము వద్ద కలవమని అడుగుతుంది. కానీ అక్కడికి వెళ్లిన రామకృష్ణకి ఓ షాకింగ్ సీన్ కనిపిస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరం. ఈ కథలో ఒక మిస్టీరియస్ ఎలిమెంట్ కూడా ఉంది. కామెడీ కథగా అనిపించిన కథనంలో బుల్లెట్ బండి గాల్లోకి లేచిపోవడం, అమ్మవారి పూనకాలు… ఇవన్నీ కాస్త ఇంట్రెస్టింగానే ఉన్నాయి.
ప్రవీణ పరుచూరి చిన్న కథ అయినా ఎదో కొత్త పాయింట్‌నే పట్టుకుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో ఆమె ఓ పాత్ర కూడా చేశారు. అన్నట్టు, ఈ సినిమాను రానా ప్రజెంట్ చేస్తున్నారు. ఆయన ప్రాజెక్ట్‌లోకి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో యూనీక్నెస్ ఉంటుందనే నమ్మకం. మరి ఇందులో ఆ కొత్త పాయింట్ ఏమిటనేది ఈ నెల 18న తెలుస్తుంది.