రిటైర్ అయితే వేదాలు, ఉపనిషత్తులు చదువుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటానని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా రిటైరైపోతే తర్వాత ఎవరు అనే అంశంపై చర్చలు కూడా ప్రారంభించారు. ఆదిత్యనాథ్ దగ్గర నుంచి అన్నామలై వరకూ చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ అసలు అమిత్ షా ఎందుకు రిటైర్ అవుతారు అన్నది మాత్రం చాలా తక్కువ మందికి వస్తున్న సందేహం.
అమిత్ షా వయసు ఇప్పుడు అరవై ఏళ్లు మాత్రమే. బీజేపీలో రిటైరవ్వడానికి 75 ఏళ్ల వయసు గడువు నిర్ణయించారు. ప్రధాని మోదీకి ఆ గడువు వచ్చినా ఆయనకు వర్తించే అవకాశాలు లేవు. ఒక వేళ మోదీ రిటైర్ అయితే ఆ పాత్ర అమిత్ షాకే దక్కుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీపై పూర్తి పట్టును అమిత్ షా ఇప్పటికే సాధించారు. ప్రధాని మోదీ ఆశీస్సులు కూడా ఉంటాయి. 75 ఏళ్లు వచ్చే వరకూ అమిత్ షా రిటైరయ్యే అవకాశం ఉండదు. ఇతరులకు చాన్స్ రాదు.
అమిత్ షాకు రాజకీయాలపై విరక్తి పుట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. గత పదేళ్లుగా ఆయన అద్భుతమైన రాజకీయ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు గుజరాత్ కే పరిమితమైన ఆయన రాజకీయం ఇప్పుడు దేశం మొత్తం విస్తరించింది. టాప్ 2 పవర్ ఫుల్ లీడర్ ఆయన. అలాంటి పవర్ ను వదులుకుని హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు లేవు. రాజకీయాల్లో ఉన్న వారు ఓపిక లేక కార్యకలాపాలు తగ్గించుకుంటారు కానీ.. రిటైరైన పరిస్థితులు భారత రాజకీయాల్లో లేవు.