వరంగల్ కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. కొండా సురేఖను పిలిపించి వివరణ తీసుకున్న కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి ఇతర నేతల్ని పిలిపించారు. వారిపై కొండా సురేఖ, కొండా మురళి కూడా ఫిర్యాదులు చేశారు. వీటిపై వివరణ తీసుకునేందుకు పిలిచారు. దీనిపై కడియం శ్రీహరి సహ ఇతర నేతలంతా కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిపై మండిపడ్డారు. మీరు సమస్యను పెంచుతున్నారా.. పరిష్కరిస్తున్నారో తెలియడం లేదన్నారు. బహిరంగ విమర్శలు చేసి.. మీడియా ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన కొండా సురేఖపై చర్యలు తీసుకోకుండా తమను పిలిచి ప్రశ్నించడం ఏమిటని మండిపడ్డారు.
కొండా దంపతులతో తిట్లు తిన్నది మేము.. మళ్లీ వచ్చి మేమే వివరణ ఇవ్వాలా అని సీరియస్ అయ్యారు. దాంతో మల్లు రవి.. వివరణ తీసుకోవడానికి.. కొండా సురేఖపై ఇచ్చిన ఆరోపణలకు సంబంధించి మాట్లాడదామని పిలిపించామని కవర్ చేసుకున్నారు. వరంగల్ నేతలు కొండా సురేఖ కావాలో.. మేము కావాలో తేల్చుకోవాలని వారు ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారు. అయితే కొండా సురేఖను ఎవరూ పెద్దగా హెచ్చరించడం లేదు. కంట్రోల్ చేయడం లేదు. ఆమె కుమార్తె.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పరకాలకు కాబోయే ఎమ్మెల్యేనని ప్రచారం చేసుకుంటున్నా ఆపేవారు లేరు. దాంతో వరంగల్ కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.
అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరూ పార్టీని వీడే అవకాశాలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు వారిపై ఉన్నాయి. అయితే కొండా సురేఖ.. తమకు ఎన్ని నియోజకవర్గాల్లో బాధ్యత ఇచ్చినా గెలిపించుకు వస్తామని చెబుతున్నారు. తమ నియోజకవర్గాల బాధ్యతలు వారికి ఇవ్వొద్దని ఇతర నేతలంటున్నారు. జిల్లా మంత్రిగా ఉన్నా సరే తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదంటున్నారు. కొండా సురేఖ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నా.. పట్టించుకోకుండా.. తమను మాత్రమే పిలిచి వివరణ తీసుకుంటున్నారన్న అభిప్రాయంలో ఇతర వరంగల్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.