వైసీపీ నేతలు తమ క్యాడర్ ను కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. 2027లో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి.. రెడీగా ఉండండి రప్పా రప్పా నరికేద్దామని కార్యకర్తల్ని ఓ వైపు రెచ్చగొడుతూంటారు. మరో వైపు రెండేళ్ల తర్వాత జగన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తాడని.. రెండేళ్ల పాటు అన్ని గ్రామాలకు తిరుగుతాడని చెబుతూంటారు. ఏది నిజమో అర్థం కాక వైసీపీ కార్యకర్తలు తలగొక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.
జమిలీ ఎన్నికలు వస్తాయని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, భూమన వంటి వాళ్లు తమ కార్యకర్తలకు చెబుతున్నారు. దానికి వారి వద్ద ఏమైనా ఆధారంగా ఉందా అంటే లేదు. కేంద్రం నుంచి జమిలీ ఎన్నికల నుంచి ఏమైనా అప్ డేట్ వస్తే.. వెంటనే ఇదిగో జమిలీ ఎన్నికలు అంటారు. నిజానికి అలాంటి చాన్స్ లేదని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే 2028లో పాదయాత్ర ప్రారంభించి .. 2029 ఎన్నికలకు పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ విషయంపై సంకేతాలు అందడంతోనే పేర్ని నాని పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు.
మరో రెండేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రెస్టు తీసుకుంటారు. వారాంతాల్లో మాత్రమే ఏపీకి వచ్చి ఒకటి , రెండు రోజులు అలజడి రేపి వెళ్తూంటారు. ఈ లోపు పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకుంటారట. ఆ తర్వాత ప్లీనరీ నిర్వహిస్తారట. పార్టీ పెట్టిన తర్వాత ప్రజాస్వామ్య యుతంగా చేయాల్సిన ఒక్క తంతు కూడా పార్టీకి నిర్వహించలేదు జగన్. తల్లిని గౌరవాధ్యక్ష పదవి నుంచి సాగనంపడానికి ప్లీనరీ పెట్టారు. మరోసారి ఆ ప్రస్తావన తీసుకు రాలేదు. మళ్లీ ఎప్పుడో పెడతామంటున్నారు. రాజకీయాలపై అసలు వైసీపీ నేతలు.. కార్యకర్తల్ని ఫూల్స్ చేయడమే గొప్పతనం అనుకుంటూ ఉంటారు.