ప్రభుత్వాలు కరెంట్ బిల్లులు వసూలు చేస్తాయి. ట్రూ అప్ అని.. ఎఫ్ఎస్ఎస్ఏ అని రకరకాల పేర్లు పెడతాయి. దాంతో బిల్లు చాంతాడు అంత అవుతుంది. వైసీపీ హయాంలో ఇదే జరిగింది. వారు పోతూ పోతూ తర్వాత కూడా బిల్లులు పెరిగేలా ట్రూ అప్ చార్జీలను పెంచి పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చినా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ఆపలేకపోయారు. అయితే ఆ తప్పుల్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు ప్రజలు కట్టిన ట్రూ అప్ బిల్లుల్లో రూ. 450 కోట్లను వారికే తిరిగి చెల్లించనుంది.
ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వం బాదిన మొత్తంలో రూ. 450 కోట్లు ప్రజలకు తిరిగి చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఆదా అయిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి అందిస్తున్నారు. దీన్ని “ట్రూ-డౌన్ చార్జెస్”గా పిలుస్తున్నారు. ఇది దేశంలోనే ఒక అరుదైన విషయం అనుకోవచ్చు. సాధారణంగా, విద్యుత్ కంపెనీలు టారిఫ్లను పెంచడానికి “ట్రూ-అప్” చార్జీలను విధిస్తాయి. అయితే, ఈ సందర్భంలో “ట్రూ-డౌన్” చార్జీల ద్వారా ఆదా అయిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి ఇవ్వడం దేశంలోనే మొదటిసారి అనుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (APSPDCL, APCPDCL, APEPDCL) మొత్తం రూ. 450 కోట్లను వినియోగదారులకు తిరిగి చెల్లించేందుకు ప్రతిపాదించాయి. ఈ మొత్తం రాష్ట్రంలోని సుమారు కోటిన్నర కోట్ల గృహ వినియోగదారులకు పంపిణీ చేస్తారు. ఈ నిధులు వినియోగదారులకు కరెంట్ బిల్లులలో సర్దుబాటు రూపంలో తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఎలా చెల్లిస్తారన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.