వాలంటీర్ల వల్లే ఓడిపోయామన్న వాదనను వైసీపీ నేతలు చాలా బలంగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తరచూ ఎవరో ఒకరు వాలంటీర్ల వల్లనే ఓడిపోయామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తాము జగన్ కే చెప్పామని వారంటున్నారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల వ్యవహారం చూసి వాలంటీర్లుగా ఐదు సంవత్సరాలు పని చేసిన వైసీపీ కార్యకర్తలు కూడా అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ను పెట్టి వారితో భయపెట్టి ఓట్లు కొట్టేద్దామని జగన్ రెడ్డి ప్లాన్. దానికి తగ్గట్లుగా అన్నీ అమలు చేసుకుంటూ వచ్చారు. వాలంటీర్లుగా తమ పార్టీ కార్యకర్తల్నే నియమించారు. వారితో అన్ని అడ్డగోలు పనులు చేయించుకున్నారు. చివరికి ఎన్నికలకు ముందు వారి గడువు ముగిసిపోతే కొనసాగిస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో పని చేయించేందుకు వారితో రాజీనామాలు చేయించారు. ఇతర పార్టీల నేతలపై కేసులు పెట్టించారు. వాలంటీర్లతో ఎన్ని ఘోరాలు చేయించాలో అన్నీ చేయించారు.
తీరా ఎన్నికల్లో ఓడిపోయాం.. వాలంటీర్ల వల్లనే ఓడిపోయామన్న ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. వారిని నెత్తిన పెట్టుకుని కార్యకర్తల్ని నిరక్ష్యం చేయడం వల్లనే పెద్ద ముప్పు వచ్చిందంటున్నారు. ఇప్పుడు కేసులు కార్యకర్తలపై పెడుతున్నారు కానీ వాలంటీర్లపై కాదని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి లాంటి వాళ్లు అంటున్నారు. కానీ ఐదు వేల జీతం కోసం ఐదు సంవత్సరాల పాటు తమ జీవితాన్ని త్యాగం చేసిన వాలంటీర్లపై సానుభూతి చూపించడం లేదు. యువత జీవితాలను నాశనం చేయడమే కాకుండా.. ఇప్పుడు వారిపై నిందలేస్తున్నారు. వాడుకుని వదిలేసే వైసీపీ నైజం మరోసారి బయటపడింది. ఇప్పుడు ఆ వాలంటీర్లు ఎటూ కాకుండా పోయారు. వారి జీవితంలో ఐదు సంవత్సరాల పాటు కోల్పోయారు.