The 100 movie review RK Naidu
తెలుగు360 రేటింగ్: 2.5/5
ఆర్.కె.సాగర్… బుల్లితెర వీక్షకులకు, అందులోనూ సీరియల్స్ ఇష్టపడేవాళ్లకు ఈ పేరు బాగా సుపరిచితమే. చక్రవాకం, మొగలిరేకులు లాంటి ధారావాహికలతో అభిమానుల్ని సంపాదించుకొన్నాడు. ఓరకంగా సీరియల్ స్టార్. హీరోగానూ కొన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ సక్సెస్ దొరకలేదు. కొంత గ్యాప్ తరవాత ఇప్పుడు ‘ది 100’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా వుంది? ఈ కథతో సాగర్ ఏం చెప్పాలనుకొన్నాడు? ఇంతకీ 100 అంటే ఏమిటి?
హైదరాబాద్ లో వరుసగా దోపిడీలు జరుగుతుంటాయి. ఓ ముఠా ప్రతి నెల సరిగ్గా అమావాస్య రోజునే ఈ దొంగతనాలకు ఒడిగడుతుంటుంది. మరోవైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న మధుప్రియ (విష్ణు ప్రియ) అనే ఓ యువతి ఆత్మహత్య చేసుకొంటుంది. ఈ రెండు కేసుల్నీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన విక్రాంత్ (ఆర్.కే.సాగర్) లోతుగా దర్యాప్తు చేస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. అవేంటి? ఈ దొంగతనాలు చేస్తోంది ఎవరు? ఆర్తి (మిషా నారంగ్) అనే ఓ క్లాసికల్ డాన్సర్ కథేమిటి? తన జీవితంలో ఏం జరిగింది? వీటన్నింటికీ విక్రాంత్ ఎలాంటి ముగింపు ఇచ్చాడు? అనేది మిగిలిన కథ.
మళయాలంలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు గ్రిప్పింగ్ గా సాగుతూ, థ్రిల్లింగ్ ని పంచుతాయి. తెరపై ఉన్న స్టార్ కాస్టింగ్ ఎవరో తెలియకపోయినా ఆ కథల్ని మనం కూడా ఎంజాయ్ చేస్తాం. ఆ తరహా స్క్రీన్ ప్లేతో తెలుగులో ఓ సినిమా చేయాలన్న ఉత్సుకత ‘100’లో కనిపించింది. ఈ సినిమా కథ ఐపీసీలోని 100 అనే సెక్షన్ అమ్మాయిలకు ఎలా వెపన్‌గా మారుతుంది? అనే విషయంపై ఫోకస్ చేసింది. అమ్మాయిలపై అఘాయిత్యాలెన్నో జరుగుతున్న ఇలాంటి తరుణంలో… ఇలాంటి సెక్షన్ గురించి అవగాహన కలిగించడం, అందుకోసం ఓ సినిమా చేయాలనుకోవడం మంచి పరిణామం.
సీన్ నెంబర్ వన్ లోంచే కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. సాఫ్ట్ వేర్ అమ్మాయి ఆత్మహత్య ఉదంతంతో కథని లాక్ చేశాడు. ఆ తరవాత దొంగతనాల ఎపిసోడ్ మొదలవుతుంది. దాంతో పాటు ఆర్తి కథ కూడా రన్ అవుతుంది. ఈ మూడు కథల్నీ దర్శకుడు ఎక్కడ లింక్ చేస్తాడు? అనే కుతూహలం ప్రేక్షకులకు కలుగుతుంది. హీరో దొంగల ముఠాని పట్టుకోవడంతో కథ అయిపోవాలి. కానీ అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. ఆర్తి జీవితంలోని విషాదం, దాని చుట్టూ నడిచే సన్నివేశాలు గుండెని బరువెక్కిస్తాయి. సాఫ్ట్ వేర్ అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకొంది? అనే విషయాన్ని దర్శకుడు సరైన టైమ్ లో రివీల్ చేయగలిగాడు. ఆ తరవాత ఒక్కొక్క ముడీ విడిపోతుంది. సాఫ్ట్ వేర్ రంగంలో, మనకు కనిపించని అన్యాయాలూ, అఘాయిత్యాలూ ఏం జరుగుతున్నాయో, అక్కడ అమ్మాయిలు ఎలా మోసపోతున్నారో.. కళ్లకు కట్టినట్టు చూపించారు.
ఇన్వెస్టిగేషన్ కథల్లో స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి. అనవసరమైన సన్నివేశాలకు కోత వేయాలి. ‘100’లో ఆ ప్రయత్నం జరిగింది. కాకపోతే.. అక్కడక్కడ లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోకి ఇచ్చినట్టు ఇంట్రడక్షన్ సాంగ్ లాంటివి ఇలాంటి కథలకు అవసరం లేదు. అలాంటివి తగ్గించుకొంటూ వెళ్తే సినిమా ఇంకా షార్ప్ గా ఉండేది. హీరో క్లూస్ పట్టుకోవడం కూడా క్రైమ్ థ్రిల్లర్స్ లో చాలా కీలకం. ‘100’లో హీరో ఎక్కువగా సీసీ కెమెరాలపై ఆధారపడి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అలాంటి చోట.. దర్శకుడు బుర్ర పెట్టి కొత్తగా సన్నివేశాలు రాసుకోవాల్సింది. క్లైమాక్స్ కూడా ఊహకు అందిపోతుంది. ఈ విషయాల్లో కాస్త శ్రద్ద పెట్టి ఉంటే ‘100’ ఇంకా మంచి సినిమా అయ్యేది.
సాగర్ లుక్ బాగుంది. తనని బుల్లి తెరపై పోలీస్‌గానే ఎక్కువ చూశారు. సినిమాలోనూ అదే పాత్ర పోషించే సరికి మరింత కనెక్ట్ అయ్యే అవకాశం వుంది. తన పరిధిలో సిన్సియర్‌గా తన పాత్ర చేసుకొంటూ వెళ్లాడు. సాధారణంగా సీరియల్ నటులు `ఓవర్ డోస్` యాక్టింగ్ తో ఇబ్బంది పెడతారు. కానీ సాగర్ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మిషా నారంగ్ ని అందంగా చూపించారు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర అది. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ కావడం వల్ల ఆ పాత్రకు మరింత సహజత్వం అబ్బింది. ధన్య బాలకృష్ణ ఫస్టాఫ్‌లో ఒకే ఒక్క సీన్లో కనిపిస్తుంది. ఇంత చిన్న పాత్రకు ఆమెను ఎందుకు తీసుకొన్నారు? అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో తన పాత్రకు ప్రాధాన్యం పెరిగింది. పుష్ప ఫేమ్ తారక్ పొన్నప్పకు మరోసారి మంచి పాత్ర పడింది. చాలా సింపుల్ గా, స్టైలీష్ గా విలనీని పండించాడు.
ఈ కథకు టెక్నికల్ సపోర్ట్ కూడా దొరికింది. శ్యామ్ కె.నాయుడు కెమెరా వర్క్ నీట్‌గా ఉంది. హర్షవర్థన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎందుకో ఈసారి అంతగా కుదర్లేదు. ఆ ఇంపాక్ట్ పెద్దగా కనిపించలేదు. ‘100’ ఓ మంచి పాయింట్ తో తీసిన సినిమా. ఎక్కడా సైడ్ ట్రాక్‌లు పట్టకుండా కేవలం కంటెంట్ పైనే ఫోకస్ చేశాడు దర్శకుడు. క్రైమ్ మూవీగా మొదలై, థ్రిల్లర్ గా టర్న్ తీసుకొని, ఎమోషన్ డ్రామాలా ముగుస్తుంది. ఈ జోన్లో సినిమాలు ఇష్టపడేవాళ్లు ఓ లుక్ వేయొచ్చు.
తెలుగు360 రేటింగ్: 2.5/5