2025లో ఫస్టాఫ్ బాక్సాఫీసు దగ్గర పెద్దగా అద్భుతాలేం జరగలేదు. ప్రతీ వంద సినిమాల్లో కనీసం 10 సినిమాలైనా ఆడతాయి.. హిట్ అవుతాయని ట్రేడ్ ఓ అంచనా వేస్తుంటుంది. ఆ లెక్కన చూసినా కనీసం 10 శాతం కూడా విజయాలు దక్కలేదు. ఆడతాయి అనుకొన్న సినిమాలు బోల్తా పడ్డాయి. వస్తాయి అనుకొన్న సినిమాలు వాయిదాలు వెదుక్కొంటూ కనిపించకుండా పోయాయి. అలా.. ఫస్టాఫ్ చాలా డల్ గా సాగింది.
ఇక టాలీవుడ్ ఆశలన్నీ సెకండాఫ్‌పైనే ఉన్నాయి. జులై నుంచి రాబోతున్న సినిమాలు బాక్సాఫీసుకు కాస్త ఉపశమనం కలిగిస్తాయని నమ్ముతోంది. అన్నింటికంటే ముఖ్యంగా వచ్చే నాలుగు వారాలూ చి్రసీమకు చాలా కీలకం. ఎందుకంటే ఈ నాలుగు వారాల వ్యవధిలో నాలుగు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. హరి హర వీరమల్లు, కింగ్ డమ్, వార్ 2, కూలీ.. ఈ నాలుగూ థియేటర్లను షేక్ చేయగలిగే సినిమాలే. బాక్సాఫీసు మళ్లీ కళకళలాడాలన్నా, హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాలన్నా ఈ నాలుగు సినిమాలు నిలబడడం అత్యవసరం.
ఈనెల 24న హరి హర వీరమల్లు సినిమా రాబోతోంది. దాదాపు నాలుగేళ్ల పాటు చిత్రీకరణ దశలోనే ఉండిపోయింది వీరమల్లు. రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈసారి 24న రావడం మాత్రం పక్కా అంటూ నిర్మాత క్లారిటీ గా చెప్పేశారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. నాన్ థియేట్రికల్ నుంచి వంద కోట్లు రాబట్టే అవకాశం ఉంది. నిర్మాత చెప్పిన రేట్లే బయ్యర్లు ఈ సినిమా కొనేస్తే.. రిలీజ్ కు ముందే నిర్మాత సేఫ్ అవుతారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరవాత రాబోతున్న తొలి సినిమా ఇదే కాబట్టి.. కచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సినిమా ఏమాత్రం నిలబడినా బాక్సాఫీసుకు పునరుత్తేజం ఖాయం.
వీరమల్లు విడుదలైన సరిగ్గా వారానికి కింగ్ డమ్ వస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఇది. విజయ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఈమధ్య తన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. అయినా సరే.. కింగ్ డమ్ క్రేజ్ తగ్గలేదు. నిర్మాత నాగవంశీ ఈ సినిమాకు ఇస్తున్న హైప్ అలాంటిది. మీరు ఎంతైనా ఊహించుకొని రండి.. థియేటర్లు తగలబడిపోతాయ్ అంటూ అభిమానులకు మాటలతోనే బూస్ట్ ఇచ్చేస్తున్నారాయన. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై కూడా ప్రేక్షకులకు గట్టి గురి వుంది. కింగ్ డమ్ నుంచి వచ్చిన విజువల్స్ కూడా ఈ సినిమాపై నమ్మకాలు పెంచుతున్నాయి. దాదాపు రూ.100 కోట్లు ఈ సినిమాపై ఖర్చు చేశారని తెలుస్తోంది. బడ్జెట్ పరంగానూ రిస్కీ ప్రాజెక్టే. అయితే తాను ఖర్చు పెట్టిన ప్రతీ పైసా ఈ సినిమా నుంచి వస్తుందని నాగవంశీ బలంగా నమ్ముతున్నారు.
కింగ్ డమ్ సినిమాకు బాక్సాఫీసు దగ్గర సరిగ్గా రెండు వారాల గ్యాప్ దొరికింది. ఆగస్టు 14న కూలీ, వార్ 2 రెండూ ఒకేసారి విడుదల కాబోతున్నాయి. రెండూ క్రేజీ ప్రాజెక్టులే. వార్ 2లో ఎన్టీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్. ఎన్టీఆర్ లేకపోతే వార్2 ని సౌత్ లో ఎవరూ పట్టించుకోకపోదురు. ఎన్టీఆర్ వల్ల ఈ సినిమాకు క్రేజ్ పెరిగింది. దాదాపు రూ.400 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారని తెలుస్తోంది. హిందీ బెల్ట్ లో ఈ సినిమా అద్భుతాలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఎన్టీఆర్ వల్ల సౌత్ లోనూ ఈ సినిమాకు మైలేజీ దొరికింది. కాకపోతే.. సౌత్ లో కూలీ తో తట్టుకొని ఎంత వరకూ నిలబడుతుంది? అనేది ప్రశ్న.
రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్.. ఇలా స్టార్లందర్నీ పోగేసి సినిమా తీసేశాడు లోకేష్ కనగరాజ్. రజనీ సినిమా అంటే పూనకాలు వచ్చేస్తాయి అభిమానులకు. ఈసారి.. నాగ్, ఉపేంద్ర, అమీర్ లాంటి వాళ్లు కూడా తోడయ్యారు. పైగా లోకేష్ మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా ఏ కోణంలో చూసినా కూలీ బాక్సాఫీసుని షేక్ చేస్తుందని బలంగా అనిపిస్తోంది. తెలుగులో ఈ సినిమా ఎంత ఓపెనింగ్ తీసుకొంటుందో చూడ్డానికి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ సినిమాపై దాదాపు రూ.400 కోట్లు ఖర్చు పెట్టారని ఓ అంచనా. అంటే నాలుగు వారాల్లో దాదాపుగా రూ.1200 కోట్ల బెట్ చిత్రసీమలో జరగబోతోంది. 2025 సెకండాఫ్‌కి ఈ నాలుగు వారాలూ చాలా కీలకం. మరి బాక్సాఫీసు జాతకం ఎలా ఉంటుందో చూడాలి.