తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ టీవీ రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నియోజకవర్గంలోని పలు పదవుల్లో జనసేనపార్టీ వారికి అవకాశం దక్కడం లేదని ఆయన రోడ్డెక్కి ధర్నా చేశారు. పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ..కూటమి స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ అంశంపై సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ నిర్ణయంపై విబేధిస్తున్నారు.
సమస్య ఏమిటో తెలుసుకోవాలి కానీ.. వెంటనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. కొవ్వూరు వివాదం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. ఆయన కూడా అన్ని వర్గాలతో మాట్లాడి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టీవీ రామారావు వ్యవహారశైలి తేడాగా ఉండటంతో కొంత కాలంగా కూటమి పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఓ ఫార్ములా ప్రకారం నియోజకవర్గ స్థాయిలో కూడా పదవులు పంచుకుంటున్నారు. అయితే టీవీ రామారావు తన అనుచరులకే పెద్ద పీట వేయాలని లేకపోతే జనసేనకు అన్యాయం జరిగిపోయిందని ధర్నాలకు దిగుతున్నారు.
గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఓ సారి చేశారు. వైసీపీ ఆయనకు సంబంధించిన నర్సింగ్ కాలేజీలో అమ్మాయిపై వేధింపులని ఓ సారి తప్పుడు ప్రచారం చేయడంతో ఆయన రాజకీయ జీవితం బుగ్గిపాలు అయింది. తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసి వంద ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. తర్వాత తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన వైసీపీలోనే చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు జనసేన, టీడీపీ మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.