వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీసినప్పుడు చాలా పరిమితులు ఉంటాయి. మితిమీరిన స్వేచ్ఛ తీసుకోలేం. అనవసరమైన డ్రామా జోలికి వెళితే అసలు విషయం చెడిపోతుంది. జరిగిన సంఘటనను సహజంగా చూపుతూనే ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలి. టొవినో థామస్ కీలక పాత్రలో నటించిన ‘నరివెట్ట’ సినిమా కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమానే. మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు సోనీ లీవ్ ఓటీటీ వేదికగా తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. మరి నరివెట్టలో చూపిన వాస్తవ ఘటన ప్రేక్షకుడిని ఎంతలా కదిలించింది?
వయనాడ్ అడవుల్లో సొంత ఇళ్ల కోసం గిరిజనులు ఆందోళన చేపడతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వర్ఘీస్ పీటర్ (టొవినో థామస్) ఇష్టం లేకపోయినా కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరతాడు. వర్ఘీస్ ఉన్న బెటాలియన్ బందోబస్తు కోసం వయనాడ్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వెళ్లిన అతడికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. తన కళ్లముందే ఓ ఘోరమైన ఘటన చూసి చలించిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గిరిజనుల ఆందోళనను అణిచివేయాలని చూసింది ఎవరు? అడవి బిడ్డలకు ఎలాంటి అన్యాయం జరిగింది? చివరికి వర్ఘీస్ ఏం చేశాడు? అనేది తక్కిన కథ.
వ్యవస్థ, సమాజంలో జరిగిన అన్యాయానికి తెరరూపం ఇస్తున్నప్పుడు కథనంలో చాలా పటుత్వం ఉండాలి. ఒక క్యారెక్టర్ కోసం అసలు కథ పక్కదారి పట్టకూడదు. ఈ చిత్రంలో కూడా ఒక అన్యాయమైన ఘటన ఉంది. అది సమాజానికి తెలియాలి. అయితే దానికి తెరరూపం ఇచ్చే ప్రయత్నం అంత బలంగా కుదరలేదు. ఒక కష్టం ఎదురుకున్న సమాజం నుంచి కాకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తి కోణంలో ఈ కథను చెప్పడం ఎమోషన్‌ను పాడు చేసింది. సినిమాకు బలం అవ్వాల్సిన వర్ఘీస్ క్యారెక్టర్ బలహీనతగా మారింది.
వయనాడ్ అడవుల్లో గిరిజనుల పోరాటం, వారికి ఎదురైన అన్యాయం ఈ కథకు మూలం. ఈ కథను జై భీమ్ తరహాలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా చూపించాలనే ప్రయత్నం జరిగింది. నిజానికి జై భీమ్లాంటి ఘటన ఇందులోనూ ఉంది. కాకపోతే… వర్ఘీస్ కోణం నుంచి ఆ ఘటన గురించి చెప్పడం అంత ఎఫెక్టివ్‌గా కుదరలేదు. గిరిజనుల పోరాటం, వారు ఎదురుకున్న పరిస్థితి చూపించిన తర్వాత వాళ్లతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. అయితే ప్రేక్షకుడి ఆసక్తితో పని లేకుండా వర్ఘీస్ ప్రేమకథ, ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ చూపించడం ఇబ్బందిగా మారింది.
వర్ఘీస్ వయనాడ్ వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అప్పటివరకు కాలయాపన చేస్తూ కూర్చోవడం ఇలాంటి సీరియస్ కథలకు పొసగదు. అయితే దర్శకుడు ఎంచుకున్న ఘటనలో నిజాయితీ, సహజత్వం ఉండటం కారణంగా చివరి 40 నిమిషాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఆందోళనలను అణచివేయడానికి అధికారులు తీసుకునే నిర్ణయాలు, బ్రూటల్ పోలీస్ వ్యవస్థ చుట్టూ నడిపిన సన్నివేశాలు, గిరిజనుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు ఇవన్నీ ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి.
వర్ఘీస్గా టొవినో థామస్ నటనకి వంకపట్టలేం కానీ.. ఆ పాత్ర కోణం నుంచి ఈ కథ చెప్పడం, అతడి నేపథ్యం అంతగా కుదరలేదు. అయితే ఆ పాత్రను హీరోలా కాకుండా అండర్‌డాగ్‌లా ట్రీట్ చేయడం బావుంది. బషీర్‌గా సూరజ్ వెంజరమూడి పాత్ర కథకు ఒక ఎమోషనల్ టర్న్ ఇస్తుంది. డీఐజీ రఘురామ్‌గా చేరన్ సహజంగా కనిపించారు. అడవిలో తేనె అమ్మే నటుడి కళ్లలో ఏదో తెలియని అమాయకత్వం ప్రేక్షకుడిని వెంటాడుతుంది.
సాంకేతికంగా డీసెంట్‌గా ఉంది. అన్నీ రియల్ లోకేషన్లలో షూట్ చేయడం ప్రామాణికత తీసుకొచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. దర్శకుడు ఎంచుకున్న ఘటన అందరినీ కదిలించేదే. సరిగ్గా ట్రీట్ చేసివుంటే జై భీమ్లాంటి సినిమా కోవలోకి చేరేది. కానీ పోలీస్ కోణం నుంచి కథ చెప్పడం, దానికి అనవసరమైన ప్రేమకథ తోడవ్వడం ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ ఇది బ్యాడ్ ఫిలిం కాదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ‘నరివెట్ట’ని నిరభ్యంతరంగా చూడొచ్చు.